దుమ్ము రేపిన షావోమి

31 Oct, 2019 14:48 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ కంపెనీ ‘షావోమి’ దసరా, దీపావళి అమ్మకాల్లో దుమ్మురేపింది. ఈ పండగ సీజన్‌లో 1.2 కోట్ల ఎలక్ట్రానిక్‌ వస్తువులు అమ్మి సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 29 వరకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ డాట్‌కామ్‌ ద్వారా నిర్వహించిన పండగ అమ్మకాల్లో భారీ వృద్ధి సాధించింది. గతేడాది ఫెస్టివ్‌ సేల్స్‌తో పోల్చుకుంటే 40 శాతం వృద్ధి నమోదు చేసి భారత  మార్కెట్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది.

ఈ పండగ సీజన్‌లో 85 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. ఇందులో ఎక్కువగా రెడ్‌మి నోట్‌ 7 సిరీస్‌ ఫోన్లు అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో 6 లక్షలకుపైగా ఎంఐ టీవీలను కూడా సేల్‌ చేసింది. 30 లక్షలకు పైగా ఈకో సిస్టమ్‌ ప్రొడక్ట్స్‌ విక్రయించినట్టు షావోమి గ్లోబల్‌ వైస్ ప్రెసిడెంట్‌, షావోమి ఇండియా ఎండీ మనుకుమార్‌ జైన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ఎంఐ టీవీలు హాట్‌కేకుల్లా అమ్మడయ్యాయని తెలిపారు. పవర్‌ బ్యాంక్‌, ఎయిర్‌ ఫ్యూరిఫయిర్‌, స్మార్ట్‌ వాటర్‌ ఫ్యూరిఫయిర్లు కూడా నిమిషాల వ్యవధిలోనే సేల్‌ అయినట్టు చెప్పారు. అంచనాలను మించి అమ్మకాలు జరగడంతో వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. తమ సిబ్బందితో కలిసి ఆయన సెలబ్రేట్‌ చేసుకున్నారు.

‘పండగ అనేది షావోమికి ఎప్పుడూ పెద్ద షాపింగ్‌ సీజన్‌. అమ్మకాలను పెంచేందుకు కష్టపడ్డాం. ఈ సీజన్‌లో మా కంపెనీ అమ్మకాలు అంచనాలను మించాయి. మా ప్లాట్‌ఫామ్‌ ద్వారా 1.2 కోట్ల వస్తువులను విక్రయించి అందరికంటే ముందు నిలిచాం. ఈ సంతోషాన్ని అభిమానులతో కలిసి పంచుకుంటామ’ని షావోమి ఇండియా ఆన్‌లైన్ సేల్స్‌ హెడ్‌ రఘురెడ్డి తెలిపారు. గతేడాది పండగ సీజన్‌లో షావోమి 85 లక్షల డివైస్‌లు విక్రయించింది. (చదవండి: స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల రికార్డు, టాప్‌ బ్రాండ్‌ ఇదే)

Poll
Loading...
మరిన్ని వార్తలు