కేరళ వరదలు: షావోమి విరాళం ఏంటంటే..

18 Aug, 2018 18:40 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. వేలకోట్ల రూపాయలను నష్టపోయిన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నారు. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు షావోమి  నడుం బిగించింది. దేశీయ  స్మార్ట్‌ఫోన్‌ రంగంలో రారాజులా వెలుగొందుతున్న షావోమి  రంగంలోకి  దిగడం విశేషం.

వరద ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు సాయపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఒకవైపు భారీ వర్షాలు, వరదలు, మరోవైపు కరెంటు కష్టాలతో అల్లాడిపోతున్న ప్రజల సహాయార్దం ముందుకు వచ్చింది. రిలీఫ్‌ క్యాంపుల్లో తలదాచుకుంటున్న బాధితులకు పూర్తిగా చార్జింగ్‌ చేసిన వేలాది పవర్‌ బ్యాంకులను ఉచితంగా సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి బాక్స్‌ను వాలంటీర్లకు అందించామని  షావోమీ ఎండీ మను కుమార్‌ జైన్‌​ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా పవర్‌ బ్యాంకులకు చార్జింగ్ చేసిన తమ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.   

కాగా గత శతాబ్ద కాలంలో లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజులుగా దయనీయమైన, అధ్వాన్నమైన వాతావరణం అక్కడి ప్రజలను బాధిస్తోంది. దాదాపు 13 జిల్లాల్లో ఇంకా రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. దాదాపు మూడున్నర లక్షలమంది  సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు