యాహూ సీఈవోకు బోనస్‌ కట్‌

2 Mar, 2017 12:22 IST|Sakshi
యాహూ సీఈవోకు బోనస్‌ కట్‌
శాన్‌ఫ్రాన్సిస్కో: సీఈఓ మెరిస్సా మేయర్‌కు చెల్లించాల్సిన బోనస్‌లో యాహూ కంపెనీ కోత విధించింది. గత ఏడాది లక్షలాది యాహూ ఖాతాలు హ్యాక్‌ అయిన ఘటన నేపథ్యంలో దానిపై విచారణ చాలా ఆలస్యం అయింది. హ్యాకింగ్‌పై జరిగిన విచారణలో యాహూ ఉద్యోగుల తప్పిదాలేవి లేవు. కానీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు పలువురు ఉద్యోగులపై యాహూ చర్యలు తీసుకుంది. తాజాగా కంపెనీ సీఈవోకు ఒక ఏడాదికి అందాల్సిన రెండు మిలియన్‌ డాలర్ల బోనస్‌ను కట్‌ చేస్తున్నట్లు యాహూ బోర్డు పేర్కొంది.
 
కంపెనీ బోర్డు నిర్ణయంపై స్పందించిన మెరిసా.. హ్యాకింగ్‌పై జరిపిన దర్యాప్తులో కంపెనీ అసమర్థంగా వ్యవహరించిందని తేలడంతో పొరపాటుకు బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది బోనస్‌తో పాటు ఈక్విటీ గ్రాంట్‌ను వదులుకుంటున్నట్లు తెలిపారు. తన బోనస్‌ను కంపెనీలో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు పంచాలని చెప్పారు. మెరిస్సా 2012 నుంచి యాహూ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. వెరిజాన్‌ సంస్థ గత ఏడాది యాహూను 4.48 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
>
మరిన్ని వార్తలు