మందగమనమా? 5 ట్రిలియన్‌ డాలర్లా?

26 Dec, 2019 16:15 IST|Sakshi

దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వుందనేది దాచేస్తే దాగని సత్యం.  జీడీపీ వృద్దిరేటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా అంచనా వేయలేనంతగా దిగజారి పోయింది.  మరోవైపు తాజాగా అసోచామ్‌ వందేళ్ల ఉత్సవాల్లో 5 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ సాధన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ, ఈ లక్ష్యం ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా వుందని పలువురి అంచనా. 

దేశీయ ఆర్థిక వ్యవస్థ  "తీవ్ర మందగమనాన్ని" ఎదుర్కొంటుందని, అతిపెద్ద సంక్షోభం ఎదుర్కోక తప్పదని రేటింగ్‌ సంస్థలతోపాటు పలువురు ఆర్థిక నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థికవ్యవస్థ ఐసీయూలో ఉందని, తక్షణమే గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒక ముఖ్య శక్తిగా ఎదిగిన భారతదేశ ఆర్థికచిత్ర పటం క్రమేపీ మసకబారుతోంది. ముఖ‍్యంగా ఈ ఏడాది తీవ్రమైన వృద్ధి తిరోగమనం అంతర్జాతీయ ద్రవ్య నిధిని కూడా ఆశ్చర్యపరిచింది.  వినిమయ డిమాండ్‌ క్షీణత, ప్రైవేటు పెట్టుబడులు లేకపోవడం, దీర్ఘకాలిక సంస్కరణలు లోపించడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రతికూలతలుగా అభివర్ణించింది. 

టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్‌లో ఐఎమ్‌ఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ,  గణనీయమైన తిరోగమన సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. (2019 లో భారతదేశానికి 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఐఎంఎఫ్‌ అంచనావేసింది) ముఖ్యంగా  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2019-20 వృద్ధి అంచనాను అంతకుముందు 6.1 శాతం నుండి ఐదు శాతానికి సవరించడం గమనార్హం. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వృద్ధి అంచనాను 4.9 శాతానికి తగ్గించింది. జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నోమురా కూడా ఇదే అంచనాలను వెల్లడించింది. ఐఎంఎఫ్‌ సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది మొత‍్తం వృద్ధి 5శాతం దిగువకు వెళితే, భవిష్యత్తు మరింత నిరాశాజనకమేనని ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు.    

దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించిన నేపథ్యంలో 2019 మొదటి త్రైమాసికంలోనే జీడీపీ 5 శాతంనమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం. ఈ నెగిటివ్‌ సంకేతాలు రెండవ త్రైమాసికంలో కొనసాగి జీడీపీ 4.5 శాతానికి ప‌డిపోయింది. ఇది గత 25 త్రైమాసికాల కంటే అత్యంత నెమ్మదిగా ఉన్న త్రైమాసిక వృద్ధి. మూడ‌వ త్రైమాసికంలో జీడీపీ దూసుకెళ్తుంద‌ని ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ  4.3 శాతానికి పరిమితమవుతుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చూస్తే ఈ వృద్ధిరేటు 5.8 శాతంగా ఉంది. ఉత్పాదక రేటు మందగించింది. ఉపాధి పరిస్థితులు వినియోగదారుల డిమాండ్‌ దారుణంగా క్షీణించింది. జనవరి-మార్చి 2019 త్రైమాసికంలో భారతదేశంలో పట్టణ నిరుద్యోగిత రేటు నాలుగు త్రైమాసికాలలో 9.3 శాతం కనిష్ట స్థాయికి పడిపోయిందని ఇటీవల జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సర్వేలో తేలింది. అక్టోబరులో ఫ్యాక్టరీ ఉత్పత్తి వరుసగా మూడవ త్రైమాసికంలో 3.8 శాతం వద్ద బలహీనంగా ఉంది. 

ఆర్థిక మందగమనానికి కారణం ఏమిటి?
ప్రస్తుత తిరోగమనానికి దీర్ఘకాలిక, స్వల్పకాలిక కారణాలు రెండూ ఉన్నాయి.  అంతకుముందు కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులున్నప్పటికీ  ప్రధానంగా  కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ చేపట్టిన సంస్కరణలు, అమెరికా-చైనా మధ్య ఎడతెగని ట్రేడ్‌వార్‌ (అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు) కూడా ఆర్థికవ్యవస్థను దెబ్బ తీసాయి. ప్రధానంగా 2016లో మోదీ సర్కార్‌ చేపట్టిన అతిపెద్ద సంస్కరణ నోట్ల రద్దు మరింత ఆజ్యం పోసింది.  ప్రభుత్వం తీసుకున్న ఈ తొందరపాటు చర్య ఆర్థిక వ్యవస్థ మందగమన వేగం పెంచింది. చలామణిలో ఉన్న అధిక విలువ కలిగిన నోట్ల (రూ. 500, రూ.1000) రద్దు నగదు సరఫరాను విచ్ఛిన్నం చేసింది. క్షీణించిన నగదు చలామణి ప్రజల వినిమయ శక్తిని దెబ్బ తీసింది. ఇక ఆ తరువాత ఒకే దేశం ఒకే పన్ను అంటూ  బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తో మరిన్ని కష్టాలొచ్చాయి. అనేక చిన్న చితకా వ్యాపారాలు మూతపడ్డాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో దేశం పైకి ఎగబాకినప్పటికీ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం ఆశించినంతగా లేదు. దీనికి తోడు ప్రభుత్వం చేపట్టిన నష్ట నివారణ చర్యలేవీ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వలేదు. ఆర్థికవ్యవస్థను తిరిగి వృద్ధి మార్గంలోకి తీసుకెళ్లడానికి, ముఖ్యంగా వినిమయ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి, భూమి, కార్మిక రంగాల్లో నూతన సంస్కరణలకోసం సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ రూపకల్పనలో మోదీ ప్రభుత‍్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలతో పాటు,  ప్రముఖ ఆర్థిక విశ్లేషకులంటున్నమాట. మూడవ త్రైమాసిక ఆర్థిక  గణాంకాలు ఈ వారం రానున్నాయి. 

ఆటోరంగ సంక్షోభం,  యువకులు, ఓలా, ఉబెర్‌ 
అటు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఆటో, రియల్టీ, టెలికాం, బ్యాంకింగ్‌ రంగాలు తీవ్ర సంక్షోభాన్నిఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆటో మొబైల్‌ పరిశ్రమ గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస త్రైమాసికాల్లో  సంక్షోభంలోకి కూరుకుపోయింది. వాహనాలు అమ్మకాలు క్షీణించి, ఉత్పత్తిని నిలిపివేసాయి. మారుతి సుజుకి, అశోక్‌ లేలాంటి సంస్థలు  ప్లాంట్లను కొంతకాలంగా మూసివేసిన పరిస్థితులు. అంతేకాదు వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీనికి తోడు ఆటో పరిశ్రమకు అనుబంధంగా ఉండే విడిభాగాల కంపెనీల సంక్షోభం కూడా తక్కువేమీ కాదు. లక్షలాది ఉద్యోగులకు ఉద్వాసన పలకక తప్పని స్థితికి చేరాయి.

ఆటో మందగమనానికి ఓలా, ఉబెర్‌ లాంటి క్యాబ్‌  సర్వీసులు కారణమంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌​ కొత్త భాష్యం  సోషల్‌ మీడియాలో దుమారం రేపింది. కొత్త కార్లపై యువత ఆసక్తి చూపడం లేదనీ, ఈఎంఐల భారం భరించడానికి ఇష్టపడడం లేదని ఇది  కూడా కార్ల అమ్మకాల పతనానికి  కారణమన్నారు.  నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా జీఎస్‌టీ పన్ను భారం తగ్గించాలన్న ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్‌ తోసిపుచ్చారు. ఆటో ఒడిదుడుకులకు కారణం పన్నులు భారం కానే కాదని తేల్చిపారేశారు.అయితే తాజాగాజీఎస్టీ తగ్గించే యోచనలో ఉన్నామన్న సంకేతాలిచ్చినప్పటికీ మొత్తానికి మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్న ఆటోమొబైల్‌ రంగాన్ని కేంద్రం ఎలా ఆదుకుంటుందో చూడాలి. మరోవైపు 2020 ఏప్రిల్‌ నుంచి  కొత్త ఉద్గార నిబంధనలు అమలుకానున్నాయి.

జెట్‌ ఎయిర్‌వేస్‌  మూత
అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతకు 2019 ఏడాది మౌన సాక్ష్యంగా నిలిచింది.  దేశీయ విమానయాన రంగంలో  విశిష్ట సేవలందించిన  జెట్ ఎయిర్‌వేస్ విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు  ఈ ఏడాది ఏప్రిల్‌మాసంలో ప్రకటించింది. మరోవైపు విమానయాన రంగానికే మణిమకుటం ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియా ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం చేస్తున్న  కసరత్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎయిరిండియా విక్రయం త్వరలో పూర్తికాకపోతే.. మూసివేయక తప్పదన్న సంకేతాలివ్వడం గమనార్హం. 

ప్రభుత్వ బ్యాంకుల మెగా మెర్జర్‌
కుదేలువుతున్న ప్రభుత్వ బ్యాంకింక్‌ రంగానికి ఊతమిచ్చదిశగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా పంజాబ్‌ నేషనల్‌బ్యాంకు రెండవ బ్యాంకుగా అవతరించ నుంది. మొత్తం 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనుంది.  తద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది.  ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు, ప్రైవేటు బ్యాంకులు మొండి బాకీలు, అక్రమాలు, భారీ స్కాంలతో అతలాకుతలమవుతున్నాయి.

టెల్కోల భవితవ్యం?
దేశీయ టెలికాం రంగంలో సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో ప్రత్యర్థుల కోలుకోలేని దెబ్బతీసింది.  దీనికితోడు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు నష్టాలతో కుదేలైన టెలికాం కంపెనీలకు అశనిపాతంలా తగిలింది. వడ్డీ, జరిమానాతో సహా టెలికాం సంస్థలు ప్రభుత్వానికి దాదాపు 90,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.  ప్రభుత్వం  దీన్ని సమీక్షించక పోతే, తమ వ్యాపారాన్ని నిలిపివేయడం తప్ప మరోమార్గం లేదని స్వయంగా దిగ్గజ కంపెనీ వొడాఫోన్ ఐడియా స్వయంగా ప్రకటించడం గమనార్హం.

ఇక అమ్మకాలు లేక  దిగ్గజ రియల్టీ కంపెనీలకు చెందిన భారీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రియల్టీ రంగానికి ఊతమిచ్చేలా ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో  అటు ప్రపంచ ఆర్థిక అననుకూలతలు ఇటు దేశీయంగా వివిధ రంగాల్లో నమోదైన వరుస క్షీణత, మందగమనాన్ని అధిగమించి 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌ అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు దేశంలో రోజుకు రోజుకు ముదురుతున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను మరుగుపర్చాలనే ఉద్దేశంతోనే జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని అందించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిందనేది మరో వాదన.  ఈ విమర్శలకు తోడు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ లు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి.  ఆర్థిక మందగమనం ఆందోళనలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ చర్యలని  ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా