కన్జూమర్ డ్యూరబుల్స్‌లోకి అమర రాజా!

9 Oct, 2014 01:50 IST|Sakshi
కన్జూమర్ డ్యూరబుల్స్‌లోకి అమర రాజా!

ఏడాదిలో హోమ్ ఇన్వర్టర్ ట్యూబ్లర్ బ్యాటరీ యూనిట్
- రెండు నెలల్లో రెట్టింపు కానున్నఆటోమోటివ్ బ్యాటరీల ఉత్పత్తి
- ఈ ఏడాది వ్యాపారంలో 30% వృద్ధి అంచనా
- అమర రాజా బ్యాటరీస్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా వెల్లడి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాటరీల తయారీలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న అమర రాజా బ్యాటరీస్ వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర ఉత్పత్తులపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా కన్జూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ విభాగంలోకి ప్రవేశించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమర రాజా బ్యాటరీస్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సీఐఐ హెచ్‌ఆర్ కాన్‌క్లేవ్‌లో పాల్గొనడానికి వచ్చిన ఆయన కలిసిన విలేకరులతో మాట్లాడుతూ కొత్త ప్రోడక్టులపై దృష్టిసారిస్తున్నామన్నారు.

అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని కన్జూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లోకి ప్రవేశించే ఆలోచన చేస్తున్నామని, దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం హోమ్ ఇన్వర్టర్ బ్యాటరీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. చిత్తూరులో ఏర్పాటు చేయనున్న హోమ్ ఇన్వర్టర్ ట్యూబ్లర్ బ్యాటరీ యూనిట్ 12 నెలల్లో అందుబాటులోకి రావచ్చని తెలిపారు.
 
రూ. 1,500 కోట్లతో విస్తరణ

అమర రాజా బ్యాటరీస్ భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఆటోమోటివ్, టూవీలర్ బ్యాటరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, ప్లాస్టిక్, హోమ్ ఇన్వర్టర్ల బ్యాటరీ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ. 1,500 కోట్లు వ్యయం చేస్తున్నట్లు రామచంద్ర గల్లా తెలిపారు. పెట్టుబడి గణాంకాలు కచ్చితంగా చెప్పలేను కానీ, రూ. 450 కోట్లతో 60 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యం కలిగిన ఆటోమోటివ్ బ్యాటరీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, మిగిలిన విస్తరణ ప్రాజెక్టుల విలువ సుమారు రూ. 1,000 కోట్లు  ఉండొచ్చన్నారు. రెండు నెలల్లో ఆటోమోటివ్ యూనిట్ అందుబాటులోకి వస్తుందని, దీంతో ఈ విభాగం ఉత్పత్తి సామర్థ్యం 1.20 కోట్ల యూనిట్లకు చేరుతుందన్నారు.
 
ఈ ఏడాది డిమాండ్ బాగుంది
దేశీయ ఆటోమొబైల్ రంగం వృద్ధి బాగుండటంతో ఈ ఏడాది అమ్మకాల్లో 25 నుంచి 30 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2013-14లో అమర రాజా బ్యాటరీస్ వ్యాపారం 16 శాతం వృద్ధితో రూ. 3,4367 కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. దేశీయంగా డిమాండ్ అధికంగా ఉండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమ్మకాల్లో ఎగుమతుల వాటా 10-12 శాతంగా ఉందని, ఇది రానున్న సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గల్ఫ్, సౌత్ మిడిల్ ఈస్ట్, ఆఫిక్రాలోని కొన్ని దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు