ఈ ఏడాదే ఎయిరిండియా విక్రయం

8 Jun, 2018 01:14 IST|Sakshi

బిడ్డింగ్‌ నిబంధనల సవరణపై కసరత్తు

త్వరలో మార్గదర్శకాల ఖరారు: ప్రభుత్వ వర్గాలు  

న్యూఢిల్లీ: భారీ రుణభారం, నష్టాలతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌కు స్పందన కరువవడంతో.. నిబంధనలను సవరించాలని యోచిస్తోంది. వీటిని త్వరలోనే ఖరారు చేసి, ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2017 మార్చి ఆఖరు నాటికి ఎయిరిండియా రుణభారం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నెగ్గుకొస్తున్న ఎయిరిండియాతో పాటు రెండు అనుబంధ సంస్థలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందు కొన్ని సంస్థలు ఆసక్తి కనపర్చినా.. బిడ్డింగ్‌కు ఆఖరు తేదీ అయిన మే 31 దాకా కూడా ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. ఈ ఎదురుదెబ్బతో.. బిడ్డర్లను ఆకర్షించడంలో వైఫల్యానికి గల కారణాలను అన్వేషించడంలో కేంద్రం తలమునకలైంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ప్రభుత్వం ఊహించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. తాజా పరిణామంతో.. విక్రయ లావాదేవీకి సలహాదారుగా వ్యవహరిస్తున్న సంస్థ నుంచి వివరాలను సేకరించి, తదనుగుణంగా బిడ్డింగ్‌ నిబంధనలను సవరించడంపై దృష్టి సారించింది. ఒకవేళ సవరించినా... వాటాల విక్రయ ప్రతిపాదన గతంలో రూపొందిన దానికి పూర్తి భిన్నంగా మాత్రం ఉండబోదని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

రూ. 1,000 కోట్ల సమీకరణలో ఎయిరిండియా .. 
వరుసగా మూడో నెలలో కూడా 11,000 మంది పైచిలుకు ఉద్యోగులకు జీతభత్యాలు సకాలంలో చెల్లించలేకపోవడంతో.. ఎయిరిండియా అర్జంటుగా నిధుల వేటలో పడింది. అత్యవసర నిర్వహణ మూలధన అవసరాల కోసం రూ. 1,000 కోట్ల మేర స్వల్పకాలిక రుణాల సమీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

>
మరిన్ని వార్తలు