తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?

30 Mar, 2020 13:51 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచంలో తీవ్రమైన ఆర్థికమాంద్య పరిస్థితులు వచ్చేశాయన్న ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు  పుంజుకుంటున్నాయి.  దీర్ఘకాలిక మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా బంగారు ధరలు లాభపడ్డాయి. దీంతో దేశీయంగా  ఎంసీఎక్స్ మార్కెట్ లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ మార్చి 30 న  స్వల్పంగా  0.02 శాతం లాభపడిన పది గ్రాముల  పుత్తడి ధర రూ. 43,580 వద్ద వుంది.  అయితే జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.6 శాతం పడి రూ. 43,302 కు చేరుకుంది. ఇదే బాటలో పయనించిన వెండి ధర (మే ఫ్యూచర్స్) కిలోకు 3 శాతం క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 39,758 వద్ద కొనసాగుతోంది.  

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో,  బంగారానికి సంబంధించిన ట్రేడింగ్ లో గత 12 ఏళ్లలో లేని విధంగా గత వారంలో ఉత్తమంగా నిలిచిందనీ, ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.   బంగారం ధరలు క్షీణించిన ప్రతిసారీ పెట్టుబడిదారులు  కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం వుందని  ఎల్ కేపీ సెక్యూరిటీస్  రీసెర్చ్ అనలిస్ట్  జతీన్ త్రివేది అంచనా వేశారు.   ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఊగిసలాట ధోరణి ఉన్నప్పటికీ పది గ్రాముల ధర రూ. 39500 వద్ద సాంకేతిక మద్దతువుందని పేర్కొన్నారు. 

దేశీయంగా దిగి వచ్చిన ధర
కరోనా మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోవడంతో దేశీయంగా పసిడి ధర పతనమైంది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ 1,925 తగ్గి 43,375కు చేరింది. అటు  22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,940 రూ. 39,830కి పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.1,910కి తగ్గడంతో రూ.39,500కి పడిపోయింది. జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే బంగారం ధరలు తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  కాగా కోవిడ్ -19 సంక్షోభంతో  2009   నాటి కంటే ఘోరమౌపమాంద్యంలోకి  జారుకున్నామని  ఐఎంఎఫ్  చీఫ్ క్రిస్టాలినా జార్జివా మార్చి 27  నాటి  విలేకరుల సమావేశంలో అన్నారు.  కాగా భారతదేశంలో పసిడి ధర గత వారం 10 గ్రాములకు  రూ. 3000 పెరిగాయి.

మరోవైపు కరోనా సంక్షోభంతో చమురు ధరలు భారీగా క్షీణించాయి. సోమవారం బ్యారెల్ ధర  20 డాలర్లు దిగువకు చేరింది. అటు డాలరు ధర మార్చి 17న రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది.  గ్రీన్ బ్యాక్ ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలరు నేడు 0.34 శాతం స్వల్ప లాభంతో 98.69వద్ద వుంది. ఇలాగే దేశీయ కరెన్సీ వరుసగా రికార్డు పతనాన్ని నమోదు చేసింది. డాలరుమారకంలో 32 పైసలు పతనమై 75.21 వద్ద కొనసాగుతోంది.  శుక్రవారం 74.89 వద్ద ముగిసింది.
 

మరిన్ని వార్తలు