యస్‌ బ్యాంకు : సత‍్వర చర్యలు, కస‍్టమర్లకు ఊరట

14 Mar, 2020 15:34 IST|Sakshi
యస్‌ బ్యాంకు కొత్త సీఎండీ ప్రశాంత్‌ కుమార్‌ ( ఫైల్‌ ఫోటో)

యస్‌ బ్యాంకు విత్‌డ్రాయిల్‌ పరిమితి 18న ఎత్తివేత

యస్‌ బ్యాంకు సీఎండీ ఈయనే ప్రశాంత్‌ కుమార్‌

సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంకులో పునరుద్ధరణ  చర్యలు చకా చకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ పునరుద్ధరణ ప్రణాళిక ప్రతిపాదనలను ఆమోదించిన  కేంద్ర కేబినెట్‌ తదుపరి చర్యల్ని కూడా అంతే వేగంగా  పూర్తి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్‌ కుమార్‌ను సీఈవో, ఎండీగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం (మార్చి 14)న వెల్లడించింది. అంతేకాదు శుక్రవారం రాత్రి జారీ చేసిన నోటిషికేషన్‌​ ప్రకారం పునరుద్ధరణ  ప్రణాళిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్చి 18,  సాయంత్రం 6 గంటల నుంచి తాత్కాలిక నిషేధం రద్దు అవుతుంది. అంటే యస్‌ బ్యాంకు ఖాతాదారుడు రూ. 50వేల కు మించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటు కలుగుతుంది.

పీఎన్‌బీ మాజీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సునీల్‌ మెహతా యస్‌ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మహేష్‌ కృష్ణమూర్తి, అతుల్‌ భేడా నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెర్టర్లుగా వ్యవహరించ నున్నారు. ఇదివరకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన దాని ప్రకారం యస్‌ బ్యాంక్‌పై ప్రస్తుతం అమలు చేస్తున్ననిషేధాన్ని(మారటోరియం)ఎత్తివేసిన వారం రోజుల్లోగా వీరంతా బాధ్యతలు స్వీకరించ నున్నారు. తద్వారా యస్‌ బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కానుంది.  కాగా యస్‌ బ్యాంక్‌పై ఆంక్షలతోపాటు, ఖాతాదారుల నగదు ఉపసంహరణపై నెల రోజుల పాటు నిషేధాన్ని ఆర్‌బీఐ విధించింది. అలాగే  స్టేట్‌ బ్యాంక్‌ మాజీ సీఎఫ్‌వో, డిప్యూటీ ఎండీగా పనిచేసిన ప్రశాంత్‌ను యస్‌ బ్యాంక్‌ పాలనాధికారిగా రిజర్వ్‌ బ్యాంక్‌ నియమించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు