యస్‌లో పరిస్థితులు బాలేవు

11 Jan, 2020 03:50 IST|Sakshi

స్వతంత్ర డైరెక్టరు ప్రకాశ్‌ అగర్వాల్‌ అభ్యంతరాలు

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సరిగా లేదంటూ రాజీనామా

నిర్వహణలో జోక్యం చేసుకోవాలంటూ సెబీకి లేఖ

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంకులో పద్ధతులు, వ్యవహారాలు దిగజారిపోతున్నాయంటూ స్వతంత్ర డైరెక్టర్‌ ఉత్తమ్‌ ప్రకాష్‌ అగర్వాల్‌ బాంబు పేల్చారు. ఈ విషయమై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తన పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. ‘‘యస్‌ బ్యాంకు ఇండిపెండెంట్‌ డైరెక్టర్, ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ పదవులతో పాటు, బోర్డుకు సంబంధించిన అన్ని కమిటీల్లో సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నా’’ అంటూ బ్యాంకు తాత్కాలిక చైర్మన్‌ బ్రహ్మ్‌దత్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో అగర్వాల్‌ పేర్కొన్నారు.

కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని, నిబంధనల అమలులో వైఫల్యం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు.. ముఖ్యంగా బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్‌ గిల్, సీనియర్‌ గ్రూపు ప్రెసిడెంట్‌ రాజీవ్‌ ఉబోయ్, లీగల్‌ హెడ్‌ సంజయ్‌ నంబియార్‌ బ్యాంకును నిర్వహిస్తున్న తీరు పట్ల ఆయన తన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యస్‌ బ్యాంకు, లక్షలాది డిపాజిటర్లు, వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ కీలక అం శాల పట్ల ఎప్పటికప్పుడు ఆందోళనలు వ్యక్తం చేశాను. నా విధుల నిర్వహణలో వీటి పరిష్కారానికి శాయశక్తులా ప్రయత్నించా. నా రాజీనామాతో సంబంధం లేకుండా, బ్యాంకు కుదుటపడి, భాగస్వాములు, వాటాదారుల ప్రయోజనాలను మీ నాయకత్వంలో కాపాడుతుందని ఆశిస్తున్నాను’’ అని అగర్వాల్‌ పేర్కొన్నారు.

తక్షణం జోక్యం చేసుకోవాలి.  
ఇవే అంశాలపై సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగికి ఈ నెల 9న అగర్వాల్‌ ఓ లేఖ రాశారు. తక్షణమే సెబీ జోక్యం చేసుకోవాలని కోరారు. బ్యాంకు సీఈవో, ఎండీ రవనీత్‌ గిల్‌ గతేడాది అక్టోబర్‌ 31న బ్యాంకు 1.2 బిలియన్‌ పెట్టుబడుల ఆఫర్‌ను అందుకుందని మౌఖింగా చెప్పినట్టు లేఖలో పేర్కొన్నారు.

అగర్వాల్‌ అర్హతపై సమీక్ష.. 
స్వంతంత్ర డైరెక్టర్‌ ఉత్తమ్‌ ప్రకాష్‌ అగర్వాల్‌  రాజీనామా పై యస్‌ బ్యాంకు స్పందించింది. రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ఆదేశాల మేరకు అగర్వాల్‌ ‘ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ అర్హత ప్రమాణాలకు తగిన వారా, కాదా? అన్న దానిపై బోర్డు చర్చించడానికి ముందుగా ఆయన రాజీనామా సమర్పించినట్టు యస్‌ బ్యాంకు పేర్కొంది.

బ్యాంకు నిర్వహణపై అగర్వాల్‌ లేవనెత్తిన అభ్యంతరాలను బ్యాంకు బోర్డు తప్పకుండా పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. అగర్వాల్‌ గతంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌గా, సత్యం కంప్యూటర్స్‌ అకౌంటింగ్‌ స్కామ్‌లో ఆడిటర్ల పాత్రను నిగ్గుతేల్చే కమిటీలో పనిచేశారు.

రూ.10వేల కోట్ల సమీకరణకు యస్‌బ్యాంకు నిర్ణయం 
ముంబై: యస్‌ బ్యాంకు రూ.10,000 కోట్లను సమీకరించాలని శుక్రవారం నాటి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అర్హులైన సంస్థాగత మదుపరులకు (క్యూఐపీ) లేదా ఏడీఆర్, జీడీఆర్, ఎఫ్‌సీసీబీ తదితర మార్గాల్లో ఈ నిధులను సమీకరించనున్నట్టు ప్రకటించింది. దీనిపై వాటాదారుల అనుమతి కోరనున్నట్టు బ్యాంకు ప్రకటించింది. కెనడాకు చెందిన ఎర్విన్‌సింగ్‌ బ్రెయిచ్‌ 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ఆఫర్‌ను తిరస్కరించింది.

ఎర్విన్‌సింగ్‌ బ్రెయిచ్‌ నుంచి నవీకరించబడిన ప్రతిపాదన వచ్చిందని, అయితే, ఆ ఆఫర్‌ విషయంలో ముందుకు వెళ్లరాదని నిర్ణయించినట్టు యస్‌ బ్యాంకు తెలిపింది. అలాగే, సిటాక్స్‌ హోల్డింగ్స్, సిటాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూపు నుంచి వచ్చిన 500 మిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నామని స్పష్టం చేస్తూ.. తదుపరి బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

మరిన్ని వార్తలు