గ్రోఫర్స్‌తో యస్‌ బ్యాంక్‌ జట్టు

14 Dec, 2016 01:58 IST|Sakshi
గ్రోఫర్స్‌తో యస్‌ బ్యాంక్‌ జట్టు

ఇంటి ముంగిట్లోకే రూ.2,000 నగదు
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో కస్టమర్లకు ఇంటి ముంగిట్లోకి నగదును తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ తాజాగా ఈ–గ్రోసరీ సంస్థ ‘గ్రోఫర్స్‌’తో జతకట్టింది. ఆన్‌లైన్‌లో గ్రోఫర్స్‌ ద్వారా కిరాణా సరుకులు ఆర్డర్‌ ఇచ్చిన వారు వాటి డెలివరీతోపాటు రూ.2,000 వరకు నగదును పొందొచ్చని బ్యాంక్‌ పేర్కొంది. ఏ బ్యాంక్‌ ఖాతాదారుడైనా ఈ సేవలు పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు ముంబై, గుర్గావ్, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని వివరించింది.

క్యాష్‌ పొందాలని భావించే వారు గ్రోఫర్స్‌లో కనీసం రూ.2,000తో కిరాణా సరుకులు ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. సరుకులు ఆర్డర్‌ ఇచ్చేటప్పుడే ఒక ప్రత్యేకమైన కోడ్‌ ద్వారా నగదు కావాలని విజ్ఞప్తి చేయాలని తెలిపింది. అప్పుడు సరుకులు తీసుకొని వచ్చే యస్‌ బ్యాంక్‌ పీఓఎస్‌ మెషీన్లను కలిగిన గ్రోఫర్స్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ కస్టమర్ల డెబిట్‌ కార్డులను స్వైప్‌ చేసి వారికి నగదును అందజేస్తారని వివరించింది.

మరిన్ని వార్తలు