యస్‌ బ్యాంక్‌ లాభం రూ.1,077 కోట్లు

19 Jan, 2018 00:38 IST|Sakshi

22 శాతం వృద్ధి

మొత్తం ఆదాయం రూ.6,493 కోట్లకు

ముంబై: ప్రైవేట్‌ రంగంలోని యస్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 22 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.883 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,077 కోట్లకు పెరిగినట్లు యస్‌ బ్యాంక్‌ తెలిపింది.

మొండి బకాయిలకు కేటాయింపులు ఐదింతలైనా, మొండి బకాయిల నిష్పత్తి రెట్టింపైనా, వడ్డీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు బాగా పెరగడంతో ఈ స్థాయిలో నికర లాభంలో వృద్ధి సాధించామని యస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాణా కపూర్‌ వివరించారు.

నికర వడ్డీ ఆదాయం 27 శాతం అప్‌...
నికర వడ్డీ ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.1,889 కోట్లకు పెరిగిందని కపూర్‌ పేర్కొన్నారు. ఇతర ఆదాయం 40 శాతం వృద్ధితో రూ.1,422 కోట్లకు, నిర్వహణ లాభం 38 శాతం వృద్ధితో రూ.2,002 కోట్లకు పెరిగాయని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.5,230 కోట్ల నుంచి రూ.6,493 కోట్లకు ఎగసిందని చెప్పారు.

స్థూల మొండి బకాయిలు 0.93% నుంచి 1.72%కి, నికర మొండి బకాయిలు 0.29% నుంచి 0.93%కి పెరిగాయని తెలియజేశారు. అయితే క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పరంగా చూస్తే రుణ నాణ్యత మెరుగుపడిందని చెప్పారాయన. ఈ క్యూ2లో స్థూల మొండి బకాయిలు 1.82%గా, నికర మొండి బకాయిలు 1.04%గా ఉన్నాయని వెల్లడించారు. గత క్యూ3లో రూ.115 కోట్లుగా ఉన్న కేటాయింపులు 5 రెట్లు పెరిగి రూ,.421 కోట్లకు ఎగిశాయని తెలిపారు.

మరిన్ని వార్తలు