కాఫీడే టెక్‌ పార్క్‌ విక్రయానికి యస్‌ బ్యాంకు బ్రేక్‌!

10 Dec, 2019 05:29 IST|Sakshi

బెంగళూరు: కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్‌ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్‌ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్‌ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై హామీ ఇవ్వాలని యస్‌ బ్యాంకు కోరినట్లు తెలిసింది. ఇతర రుణదాతలంతా ఇప్పటికే కాఫీడే టెక్‌ పార్క్‌– బ్లాక్‌స్టోన్‌ ఒప్పందానికి ఆమోదం తెలిపారని, యస్‌ బ్యాంకు మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.

కాఫీ డేకు చెందిన ట్యాంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ నడుస్తోంది. ఈ కంపెనీ యస్‌ బ్యాంకుకు రూ.100 కోట్లు బకాయి పడింది. కాఫీ డే కూడా యస్‌ బ్యాంకుకు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆకస్మిక ఆత్మహత్య తర్వాత కంపెనీ యాజమాన్యం ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు చెల్లించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600– 3,000 కోట్ల విలువకు విక్రయించేందుకు నాన్‌ బైండింగ్‌ ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలతో బీఎస్‌ఈలో కాఫీడే షేరు సోమవారం 9 శాతం నష్టంతో రూ.43.85 వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తలు