డిసెంబర్‌ ఆఖరుకల్లా నిధుల సమీకరణ

4 Nov, 2019 04:22 IST|Sakshi

రూ. 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులపై యస్‌ బ్యాంక్‌ ప్రణాళిక

కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో స్థానం!

ముంబై: నిధుల వేటలో ఉన్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌.. ప్రతిపాదిత రూ. 1.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 8,462 కోట్లు) పెట్టుబడుల సమీకరణ ప్రక్రియను డిసెంబర్‌ ఆఖరునాటికల్లా పూర్తి చేయనుంది. అలాగే, కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో కూడా స్థానం కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, సుమారు 3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 21,156 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారని యస్‌ బ్యాంక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నార్త్‌ అమెరికన్‌ ఫ్యామిలీ ఆఫీస్‌’ ఇప్పటికే 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆఫర్‌ ఇచి్చంది.

దీనిపై నవంబర్‌ ఆఖరులోగా ఆ సంస్థకు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంటుందని విలేకరులకు యస్‌ బ్యాంక్‌ సీఈవో రవ్‌నీత్‌ గిల్‌ తెలిపారు. ఆ సంస్థ నుంచి లేదా పలువురు ఇన్వెస్టర్లందరి నుంచి కలిపి డిసెంబర్‌ ఆఖరు నాటికి నిధుల సమీకరణ జరపగలమని పేర్కొన్నారు. రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవాలని నిర్దేశించుకున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్ల అవసరాలకు ఈ నిధులు సరిపోగలవని గిల్‌ చెప్పారు.  మరోవైపు, సింగపూర్‌ సంస్థ డీబీఎస్‌.. తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉందంటూ వచి్చన వార్తలను గిల్‌ కొట్టిపారేశారు. అటు డీబీఎస్‌ కూడా ఈ వార్తలను ఖండించింది.

మరిన్ని వార్తలు