యస్‌ బ్యాంక్‌ లాభాలకు గండి ! 

1 May, 2019 00:44 IST|Sakshi

బ్యాలన్స్‌ షీట్‌ ప్రక్షాళన ప్రభావం 

12–18 నెలలు ఇంతే: మూడీస్‌  

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌ ఆస్తి, అప్పుల పట్టీ (బ్యాలన్స్‌ షీట్‌) ప్రక్షాళన ఆ బ్యాంక్‌ లాభదాయకతపై తీవ్రంగానే ప్రభావం చూపనున్నదని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ హెచ్చరించింది. ఈ ప్రభావం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకూ ఉంటుందని పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న రుణాలు బ్యాంక్‌ వద్ద దాదాపు 8 శాతంగా ఉన్నాయని, వీటికి కేటాయింపుల కారణంగా 12–18 నెలల పాటు బ్యాంక్‌ లాభదాయకతపై ప్రభావం పడుతుందని వివరించింది.  

తొలి త్రైమాసిక నష్టాలు... 
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ బ్యాంక్‌ ఇటీవలే వెల్లడించింది. గత క్యూ4లో ఈ బ్యాంక్‌కు రూ.1,507 కోట్ల నికర నష్టాలొచ్చాయి. బ్యాంక్‌ ఆరంభమైన 2004 నుంచి చూస్తే, ఇదే తొలి త్రైమాసిక నష్టం. అయితే పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే బ్యాంక్‌కు లాభాలే వచ్చాయి. రిటర్న్‌ ఆన్‌ అసెట్‌ మాత్రం 1.4 శాతం నుంచి 0,5 శాతానికి తగ్గింది. సమీప భవిష్యత్తులో బలహీనతలున్నప్పటికీ, కొత్త అధినేత నాయకత్వం బ్యాంక్‌కు సానుకూలాంశమేనని మూడీస్‌ పేర్కొంది. గతంలో బ్యాంక్‌ రుణ వృద్ధి సగటున 34 శాతంగా ఉందని, అయితే రానున్న మూడేళ్లలో ఈ బ్యాంక్‌ రుణ వృద్ధి 20 – 25 శాతం రేంజ్‌లోనే ఉండగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. రిటైల్‌ రుణాలు, ఎస్‌ఎమ్‌ఈ సెగ్మెంట్‌ రుణాలపై  ఈ బ్యాంక్‌ మరింతగా దృష్టిసారించాలని సూచించింది. అలాగే కార్పొరేట్‌ రుణాలను తగ్గించుకోవాలని కూడా పేర్కొంది. ఫలితాలు నిరాశపరచడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ భారీగా పతనమైంది. బీఎస్‌ఈలో 29 శాతం నష్టంతో రూ.168 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు