ఘోరంగా పడిపోయిన యస్‌ బ్యాంక్‌ షేరు

21 Sep, 2018 11:42 IST|Sakshi
యస్‌ బ్యాంక్‌ (ఫైల్‌ ఫోటో)

ముంబై : ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ నేటి ట్రేడింగ్‌లో భారీగా పడిపోయింది. దలాల్‌ స్ట్రీట్‌లో ట్రేడింగ్‌ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే యస్‌ బ్యాంక్‌ షేరు 30 శాతానికి పైగా కుప్పకూలింది. 2008 జనవరి తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. బ్యాంక్‌ సీఈవో, ఎండీ రానా కపూర్‌ పదవీ కాలాన్ని కుదించి, ఆయన్ని 2019 జనవరి వరకు తన పదవి నుంచి దిగిపోవాలని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించడం షేరును అతలాకుతలం చేసింది. 2004లో బ్యాంక్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి బ్యాంక్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కపూరే ఉన్నారు. మూడేళ్ల పాటు అంటే 2021 ఆగస్టు 31 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని బ్యాంక్‌ షేర్‌ హోల్డర్స్‌ కోరారు. అయితే ఆ అభ్యర్థనను రెగ్యులేటర్‌ కొట్టివేసింది. 2019 జనవరి వరకు కపూర్‌ స్థానంలో బ్యాంక్‌కు కొత్త సీఈవో, ఎండీ రావాల్సిందేనని తెలిపింది. 

ఈ ఏడాది జూన్‌లోనే కపూర్‌ను మరో మూడేళ్ల పాటు రీ-అపాయింట్‌మెంట్‌ చేస్తూ యస్‌ బ్యాంక్‌ షేర్‌ హోల్డర్స్‌ అంగీకరించారు. అది తుది ఆమోదం కోసం ఆర్‌బీఐ వద్దకు వెళ్లింది. కానీ ఆర్‌బీఐ మాత్రం మరో మూడేళ్ల పొడిగింపుపై ససేమీరా అనేసింది. ప్రస్తుతం పదవి కాలం ఆగస్టు 31తో ముగిసింది. తుదుపరి నోటీసులు పంపే వరకు ఆ పదవిలో కపూర్‌ కొనసాగనున్నారు. కపూర్‌, 2008లో చనిపోయిన అశోక్‌ కపూర్‌లు ఇద్దరూ యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక టీమ్‌లో సభ్యులు. ప్రమోటర్‌గా, కపూర్‌, ఆయన కుటుంబానికి బ్యాంక్‌లో 10.66 శాతం వాటా ఉంది.  కాగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10 శాతం మేర నష్టపోయిన యస్‌ బ్యాంక్‌షేరు రూ.287.30గా నమోదైంది. ఆ అనంతరం అర్థగంటకి మరింత కుదేలై రూ.218.10కి చేరింది. నష్టాలను కొంతమేర తగ్గించుకున్న యస్‌ బ్యాంక్‌, ప్రస్తుతం 17.48 శాతం నష్టంలో రూ.263.40 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు