అభివృద్ధి సైనికులుగా మారండి

23 Aug, 2017 01:12 IST|Sakshi
అభివృద్ధి సైనికులుగా మారండి

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తోడ్పడండి  ∙
యువ సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన  


న్యూఢిల్లీ: అభివృద్ధి సాధన కోసం యువ వ్యాపారవేత్తలు సైనికులుగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భారత్‌ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తగు పరిష్కార మార్గాలు కనుగొనాలని, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అలాగే తక్కువ నగదు చలామణిలో ఉండే ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ’మార్పునకు ప్రతినిధులు’ పేరిట నీతి ఆయోగ్‌ నేతృత్వంలో మంగళవారం సుమారు 200 మంది సీఈవోలు, స్టార్టప్‌ సంస్థలతో భేటీ అయిన ప్రధాని ఈ సూచనలు చేశారు.

పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించడంలో పాలుపంచుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచే దిశగా కృషి చేయాలని ప్రధాని చెప్పారు. స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా గాంధీ సామాన్యులను కూడా ఎలా భాగస్వాములను చేశారో.. భారత అభివృద్ధి విషయంలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన చెప్పారు. ‘కలసికట్టుగా పనిచేయడం ద్వారా దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించవచ్చు‘ అని ప్రధాని తెలిపారు.

భీమ్‌ యాప్‌కి మరింత ప్రాచుర్యం..
ఎకానమీలో నగదు వాడకం తగ్గించే దిశగా.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు భీమ్‌ యాప్‌నకు మరింత ప్రాచుర్యం కల్పించాలని సీఈవోలకు ప్రధాని సూచించారు. 2022 నాటికల్లా తమ తమ సంస్థల్లోని ఉద్యోగులు నగదు రహిత లావాదేవీలే జరిపేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సిబ్బందికి దీపావళి వంటి పండుగల సందర్భంగా ఇచ్చే బహుమతులను ఖాదీ కూపన్స్‌ రూపంలో అందించాలని ఆయన చెప్పారు. ‘సుసంపన్నమైన సంస్కృతి మనకు గర్వకారణం. మనం మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెడితే.. యావత్‌ ప్రపంచం భారత్‌ సందర్శించేందుకు ఉవ్విళ్లూరుతుంది‘ అని పర్యాటక రంగం ప్రాధాన్యం గురించి వివరించారు.

మరిన్ని వార్తలు