మీ పేటీఎం, మొబిక్విక్‌ వాలెట్లు పనిచేయవు..

1 Mar, 2018 15:55 IST|Sakshi
డిజిటల్‌ వాలెట్లు (ఫైల్‌ ఫోటో)

బెంగళూరు : మీ మొబైల్‌ వాలెట్‌లోకి కొత్తగా ఫండ్స్‌ను పంపించాలనుకుంటున్నారా? అయితే నేటి నుంచి అది సాధ్యపడదట. ఫుల్‌ కేవైసీ(నో యువర్ కస్టమర్) విధివిధానాలను పూర్తి చేసిన కస్టమర్లకు మాత్రమే ఇది సాధ్యపడుతుందట. ఒకవేళ కేవైసీ వివరాలను సమర్పించిన కస్టమర్లు ఇక తమ వాలెట్లలోకి కొత్తగా ఫండ్స్‌ను పంపించుకోవడం జరుగదు. ఇది డిజిటల్‌ పేమెంట్స్‌ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బగా వెల్లడవుతోంది. నేటి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా విధించిన కేవైసీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో వాలెట్‌ యూజర్లు తమ లావాదేవీలపై ఆర్‌బీఐ విధించే పలు నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తోంది.  

ఫిబ్రవరి 28 వరకు వాలెట్‌ యూజర్ల నుంచి కేవైసీ వివరాలను పొందాలని డిజిటల్‌ వాలెట్‌ కంపెనీలకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. ఈ గడువును మరింత పొడిగించాలని డిజిటల్‌ వాలెట్‌ కంపెనీలు కోరాయి. కానీ కంపెనీల ప్రతిపాదనను ఆర్‌బీఐ తోసిపుచ్చింది. మరోసారి తుది గడువును పొడిగించేది లేదంటూ తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిన్నటితో ఆ గడువు ముగియడంతో, కేవైసీ వివరాలను సమర్పించని కస్టమర్లను వాలెట్‌ ప్రొవైడర్లు కోల్పోతున్నారు. 

ఫుల్‌ కేవైసీ వివరాలు లేకుండా 10 వేల రూపాయల వరకు ఆపరేట్‌ చేసుకునేలా డిజిటల్‌ వాలెట్లకు అనుమతి ఇ‍వ్వాలంటూ ఇండస్ట్రి బాడీ పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, రిజర్వు బ్యాంకును కోరుతోంది. కానీ ప్రతి పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కేవైసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిదేనంటూ ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీన్ని బ్యాంకింగ్‌ఎకో సిస్టమ్‌కు కూడా విస్తరించనున్నట్టు పేర్కొంది. 

ఈ నిబంధనలతో వచ్చే కొన్ని నెలల్లో కస్టమర్ల కూడా భారీగా ప్రభావితం కానున్నారని ది మొబైల్‌ వాలెట్‌ ఫౌండర్‌ వినయ్‌ కలాంత్రి అన్నారు. కానీ దీర్ఘకాలీన ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పారు. క్వాలిటీ కస్టమర్లను వాలెట్లు పొందుతాయన్నారు. ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం, ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను వాలెట్‌ ప్రొవైడర్లకు సమర్పించిన కస్టమర్లు, తాజాగా ఫండ్స్‌ను తమ వాలెట్లలోకి వేసుకోవడం కుదరదు. అంతేకాక ఇతర వాలెట్లకు ఫండ్స్‌ ట్రాన్సఫర్‌ చేయలేరు. అయితే వాలెట్‌లో ఉన్న ఫండ్స్‌ను కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. వాలెట్‌ నగదును కోల్పోకుండా.. వాటిని బ్యాంకులకు ట్రాన్సఫర్‌ చేసుకునేలా కూడా ఆర్‌బీఐ వీలు కల్పించింది. ప్రీపెయిడ్‌ వాలెట్‌ సర్వీసులను వినియోగిస్తున్న 90 శాతం కస్టమర్లు ఇప్పటి వరకు కేవైసీ వివరాలను వాలెట్‌ ప్రొవైడర్లకు సమర్పించలేదు. దీంతో నేటి నుంచి వీరిపై వాలెట్ల వాడక నిషేధం పడబోతుంది. ఈ చర్యలతో వాలెట్‌ ప్రొవైడర్లు భారీగా కస్టమర్లు కోల్పోనున్నారు.  
 

మరిన్ని వార్తలు