జాబ్‌ మారితే, పీఎఫ్‌ అకౌంట్‌ కూడా...

11 Aug, 2017 10:59 IST|Sakshi
జాబ్‌ మారితే, పీఎఫ్‌ అకౌంట్‌ కూడా...
న్యూఢిల్లీ :  పీఎఫ్‌ అకౌంట్‌ ప్రతి ప్రైవేట్‌ ఉద్యోగి కలిగి ఉండే ఓ పొదుపు ఖాతా. ఇన్ని రోజులు ఉద్యోగి సంస్థ మారినప్పుడల్లా ఆ అకౌంట్‌ను మూసివేయడం, మళ్లీ కొత్త సంస్థల్లో చేరిన తర్వాత కొత్త పీఎఫ్‌ అకౌంట్‌ తెరవడం చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం పీఎఫ్‌ ఖాతాదారులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌ న్యూస్‌ అందించింది. ఒకవేళ మీరు ఉద్యోగం మారితే, ఆటోమేటిక్‌గా పీఎఫ్‌ అకౌంట్‌ కూడా మారుతుందని చీఫ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వీపీ జాయ్‌ తెలిపారు. కార్మికులకు అనుకూలమైన రీతిలో ఎన్నో చర్యలను ఈపీఎఫ్‌ఓ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం మారినప్పుడు, చాలా ఖాతాలు మూతపడుతున్నాయని, తర్వాత వారి అకౌంట్లను పునఃప్రారంభిస్తున్నారని అలా జరుగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని జాయ్‌ చెప్పారు.  
 
ప్రస్తుతం పీఎఫ్‌ అకౌంట్‌కు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను తప్పనిసరి చేస్తున్నామని పేర్కొన్నారు. పీఎఫ్‌ అకౌంట్‌ అనేది శాశ్వత అకౌంట్ అని, సామాజిక భద్రత కోసం ఒకే ఖాతాను ఉద్యోగులు కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఉద్యోగం మారితే, ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే మూడు రోజుల్లో నగదును ట్రాన్సఫర్‌ చేయడానికి ప్రయత్నిస్తామని కూడా భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లి పనిచేసినా ఒక్క ధృవీకరణ ఐడీ, ఆధార్‌తో ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే అకౌంట్‌ను ట్రాన్సఫర్‌ చేస్తామన్నారు.  ఈ సిస్టమ్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని జాయ్‌ పేర్కొన్నారు.  
 
>
మరిన్ని వార్తలు