భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం

23 Nov, 2019 04:13 IST|Sakshi

యువతరంలో నిరుద్యోగ సమస్యపై ఈఐయూ విశ్లేషణ

న్యూఢిల్లీ: భారత్‌ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్‌ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది,   ఆర్థిక వృద్ధి మందగమనం నిరుద్యోగ సమస్యను  తీవ్రతరం చేసిందని వివరించింది.

‘‘పటిష్ట నాయకత్వం, సామాజిక, భద్రతా అంశాల ప్రాతిపదికన ఈ ఏడాది రెండవసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించినప్పటికీ,  పెద్ద సంఖ్యలో ఉన్న యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు రూపునిస్తున్న పరిస్థితి పెరుగుతోంది’’ అని ఈఐయూ పేర్కొంది.   సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ డేటాను ఈఐయూ నివేదిక ప్రస్తావిస్తూ, ‘‘2019 సెప్టెంబర్‌లో 7.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మరుసటి నెల అక్టోబర్‌లోనే మూడేళ్ల గరిష్ట స్థాయి 8.5%కి పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న యువతను చక్కటి మానవ వనరుగా వినియోగించుకుంటూ,  రానున్న కొద్ది దశాబ్దాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందాలని దేశం భావిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో మాత్రం వెనుకబడుతున్నట్లు విశ్లేషించింది.

మరిన్ని వార్తలు