ఇక ఆఫ్‌లైన్లోనూ యూట్యూబ్ వీడియోలు

12 Dec, 2014 01:51 IST|Sakshi
ఇక ఆఫ్‌లైన్లోనూ యూట్యూబ్ వీడియోలు

ముంబై: నెటిజన్లు అధికారికంగా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పిస్తూ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ గురువారం కొత్తగా ఆఫ్‌లైన్ సర్వీస్ ప్రారంభించింది. భారత్ సహా ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం వెబ్‌సైట్లో ప్రత్యేక ఐకాన్ ఉంటుంది. వైఫై జోన్‌లో లేదా డేటా కనెక్టివిటీ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో ఉన్నప్పుడు  ఈ ఐకాన్‌ని క్లిక్ చేసి వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని 48 గంటల పాటు ఆఫ్‌లైన్లో ఎన్నిసార్లయినా చూడొచ్చు.

ఆఫ్‌లైన్ వీడియోల్లోనూ ప్రకటనలు వచ్చేలా యూట్యూబ్ ఏర్పాట్లు చేసింది. వీడియోలను మళ్లీ చూడాలనుకున్నప్పుడు డేటా ప్లాన్ కోసం అధికంగా ఖర్చు చేయకుండా ఈ సర్వీసు ఉపయోగపడుతుందని, బఫరింగ్ సమస్య కూడా ఉండదని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు. దేశంలో యూట్యూబ్ యూజర్లు 6 కోట్ల పైచిలుకు ఉన్నారు. యూట్యూబ్‌లో 10,000 పైచిలుకు భారతీయ సినిమాలు.. 20,000 పైచిలుకు టీవీ షోలు, 2.5 లక్షల పైగా పాటలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

మరిన్ని వార్తలు