భారత ప్రేక్షకులకు యూట్యూబ్‌ ‘ఒరిజినల్స్‌’

6 Sep, 2018 01:26 IST|Sakshi

ఏఆర్‌ రెహమాన్‌తో జట్టు

న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో తరహాలో యూట్యూబ్‌ కూడా భారత ప్రేక్షకులకు ప్రత్యేక వీడియోలను అందించే కార్యక్రమానికి ‘ఒరిజినల్స్‌’ కింద శ్రీకారం చుట్టింది. ఇందు కోసం విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో జట్టు కట్టింది. భారత్‌ నుంచి యూట్యూబ్‌ ఒరిజినల్‌ కంటెంట్‌ తీసుకోవడం ఇదే మొదటి సారి. ఇప్పటికే పలు దేశాల్లో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఒరిజినల్స్‌ కింద ప్రత్యేక వీడియోలను ఆఫర్‌ చేస్తోంది. కాకపోతే మన దేశంలో ఇంకా ఏ తేదీన ఈ పెయిడ్‌ సేవలను ఆరంభించేదీ యూట్యూబ్‌ ఇంకా నిర్ణయించలేదు.

‘‘డేటా ధరలు చౌకగా ఉండడం భారత్‌లో వీడియోల వీక్షణను పెంచుతోంది. ఓ చందాదారుడి నెలవారీ సగటు డేటా వినియోగం 8జీబీగా ఉంటోంది. ఇది ఆన్‌లైన్‌ వీడియోల వినియోగాన్ని పెంచుతోంది. ప్రస్తుతం మొబైల్‌ ట్రాఫిక్‌లో 75 శాతం ఇదే ఉంది’’ అని యూట్యూబ్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం హెడ్‌ సత్య రాఘవన్‌ తెలిపారు. ఈ ధోరణి నుంచి యూట్యూబ్‌ ఎంతో లబ్ధి పొందిందని, నెలవారీ యూజర్లు 24.5 కోట్ల మందికి చేరారని చెప్పారు. రోజువారీ వీడియోలను చూసే వారి సంఖ్య ఏటేటా నూరు శాతం పెరుగుతోంది’’ అని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు