టార్గెట్ టిక్‌టాక్‌: యూట్యూబ్‌ టెస్టింగ్

26 Jun, 2020 16:22 IST|Sakshi

త్వరలో టిక్ టాక్ తరహాలో కొత్త ఫీచర్ 

15 సెకన్ల గరిష్ట నిడివి

సాక్షి, న్యూఢిల్లీ : చైనా బ్యాన్,  చైనా యాప్స్ తొలగింపు ప్రచారం ఊపందుకున్న సమయంలో యూట్యూబ్ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఫీచర్‌తో యూట్యూబ్ రాబోతోంది. పాపులర్ వీడియో ప్లాట్‌ఫామ్, చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాదిరిగానే సరికొత్త ఫీచర్‌ను యూట్యూబ్ త్వరలోనే లాంచ్ చేయనుంది. గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫాం క్రొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండిండిలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది. అయితే ఇందులో 15 సెకన్ల వీడియో పోస్ట్ చేయడానికి  మాత్రమే అనుమతి ఉంది.

తమ వెబ్‌సైట్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. పరీక్షల అనంతరం దీన్ని భారీగా లాంచ్ చేయనున్నామని తెలిపింది. గరిష్టంగా 15 సెకన్ల వరకు వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ వీడియోలను అప్‌లోడ్ చేయాలనుకుంటే, ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే టిక్‌టాక్ మాదిరిగా ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ లభిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. టిక్‌టాక్ లేదా ఇతర ఆధునిక చిన్న వీడియో యాప్ లలో కూడా వీడియో కంటెంట్ లిమిట్ ఎక్కువ ఉండటంతోపాటు, ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ దీన్ని మరింత మెరుగుపర్చకపోతే, స్టోరీస్ ఫీచర్ లాగా మరచిపోవడం ఖాయమని టెక్ పండితులు భావిస్తున్నారు.

కాగా షార్ట్స్ పేరుతో టిక్‌టాక్‌ లాంటి యాప్‌ను యూట్యూబ్ త్వరలో తీసుకురానుందని ఏప్రిల్ నెలలో పలు నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ఫీచర్లను అనుకరించడం యూట్యూబ్‌కి ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్ తరహాలో స్టోరీస్ అప్‌డేట్ ఫీచర్‌ రీల్స్ ను ప్రవేశపెట్టింది. కానీ దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. అటు ఫేస్ బుక్ కూడా టిక్ టాక్ మాదిరిగానే లాస్సో  అనే యాప్‌ను తీసుకురానుందని  తెలుస్తోంది. 

చదవండి : గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా: నిర్మలా సీతారామన్
చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?

మరిన్ని వార్తలు