భారీగా డబ్బులు పోగొట్టుకున్న క్రికెటర్‌ తల్లి

7 Oct, 2018 13:52 IST|Sakshi

పోంజి స్కీమ్‌ల పేరిట జరుగుతున్న మోసాలు ఇటీవల బాగా వెలుగులోకి వస్తున్నాయి. తెలుసో తెలియకో చాలా మంది వీటి బారిన పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తల్లి షబ్నమ్‌ సింగ్‌ కూడా వచ్చి చేరారు. ఆమెతో పాటు చాలా మంది ఇన్వెస్టర్లు భారీగా డబ్బులు పోగొట్టుకుని నెత్తి పట్టుకున్నారు. సాధన ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన పోంజి స్కీమ్‌ మేనేజర్లు యువరాజ్‌ సింగ్‌ తల్లి  షబ్నమ్ సింగ్‌తో పాటు మరికొంత పెట్టుబడిదారులకు, దాదాపు 84 శాతం రిటర్నులు ఇస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన వీరు, సాధన ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన పోంజి స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టారు. యువరాజ్‌ సింగ్‌ తల్లి సుమారు కోటి రూపాయలు దీనిలో ఇన్వెస్ట్‌ చేశారు. కానీ వీరెవరికీ వాగ్దానం చేసినంత డబ్బులు ఇవ్వకుండా.. ఆ ఫండ్స్‌ను షెల్‌ కంపెనీలో తరలించారు ఆ పోంజి స్కీమ్‌ మేనేజర్లు. ఈ స్కామ్‌ విలువ దాదాపు రూ.700 కోట్ల మేర ఉంటుందని అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద పోంజి స్కీమ్‌ మేనేజర్లపై ఈడీ ఫిర్యాదు దాఖలు చేసింది. 

ఇన్వెస్టర్లు మోసం చేస్తూ.. వారు జరిపిన లావాదేవీలన్నింటిన్నీ ఈడీ పరిశీలిస్తోంది. మరోవైపు యువరాజ్‌ సింగ్‌ తల్లి షబ్నమ్‌ పెట్టిన కోటి రూపాయల పెట్టుబడిని కూడా ఈడీ విచారిస్తోంది. ఆమె చెక్‌ల ద్వారా దానిలో పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. అయితే ఆమె పెట్టుబడులకు వారు ప్రతినెలా రూ.7 లక్షల ఇస్తారని చెప్పినట్టు షబ్నమ్‌ చెప్పారు. దానిలో సగం మేర రిటర్నులను అధికారిక బ్యాంకింగ్‌ ఛానల్స్‌ ద్వారా ఆమెకు చెల్లించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కానీ మిగతా రూ.50 లక్షలను మాత్రం చెల్లించలేదు. అయితే ఈ కేసులో  ఆమె జరిపిన లావాదేవీలన్నింటిన్నీ వారం రోజుల్లో తమకు తెలుపాలని ఈడీ, షబ్నమ్‌కు నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ తనకు ఎలాంటి నోటీసులు రాలేదని షబ్నమ్‌ కొట్టిపారేశారు.  పోంజి స్కీమ్‌లో, బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌, హవాలా లావాదేవీల్లో భాగమైన సాధన ఎంటర్‌ప్రైజస్‌, ఇతర షెల్‌ కంపెనీల లావాదేవీలన్నింటిన్నీ ఈడీ పరిశీలిస్తోంది. అయితే దీనిలో యువరాజ్‌కు ఎలాంటి ప్రమేయం లేదని తెలిసింది. 

మరిన్ని వార్తలు