చిదంబరంతో విభేదాలతో రెండుసార్లు వైదొలగాలనుకున్నా!

26 Jun, 2017 01:55 IST|Sakshi
చిదంబరంతో విభేదాలతో రెండుసార్లు వైదొలగాలనుకున్నా!

న్యూఢిల్లీ: ప్రభుత్వంతో రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్లకు ఉన్న చేదు జ్ఙాపకాలు కొత్తేమీ కాదు. మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ వైవీ రెడ్డికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట అప్పట్లో. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరంతో విభేదాలను వైవీ రెడ్డి తన స్వీయ చరిత్ర.. ‘అడ్వైజ్‌ అండ్‌ డిసెంట్‌:మై లైఫ్‌ ఇన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌’లో బయటపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే చిదంబరంతో పొసగకపోవడంతో రెండుసార్లు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అనుకున్నారట. తొలుత 2004లో చిదంబరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ల తర్వాత కాగా, యూపీఏ–1 సర్కారు చివరినాళ్లలో మరోసారి గవర్నర్‌ పదవి నుంచి వైదొలగాలని భావించినట్లు వైవీ రెడ్డి పేర్కొన్నారు.

 2003 నుంచి 2008 మధ్యకాలంలో ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు. తమ మధ్య బేదాభిప్రాయాలను సద్దుమణిగేలా చేయడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జోక్యం కూడా చేసుకున్నారని.. తాను చిదంబరానికి బేషరతుగా క్షమాపణలు చెప్పానని కూడా వైవీ రెడ్డి తన ఆత్మకథలో తెలిపారు. అయినప్పటికీ.. తమ మధ్య విభేదాలు సమసిపోలేదని చెప్పారు. దేశీ బ్యాంకింగ్‌ రంగంలో యాజమాన్య హక్కులను విదేశీ సంస్థలు దక్కించుకునే విధంగా ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనసాగించే విషయంలో చిదంబరం తనకు మధ్య అసలు గొడవ మొదలైందని.. అది 2008 నాటికి తారస్థాయికి చేరినట్లు వైవీ రెడ్డి రాసుకున్నారు. ‘ఆర్థిక వ్యవస్థను రెండంకెల వృద్ధి దిశగా పరుగులు పెట్టించే సంస్కరణవాదిగా ఆయన(చిదంబరం)కు ఒక పేరు ఉండేది. అయితే, కొన్ని సంస్కరణలు, ప్రభుత్వ విధానాల అమలును వ్యతిరేకిస్తూ.. హెచ్చరికలు చేయడం ఆయనకు నచ్చలేదు. సంస్కరణల గురించి చెప్పుకోవడానికి ఏమీలేకపోవడంతో ఇన్వెస్టర్లకు మొహం చూపించుకోలేక ఒకసారి చిదంబరం విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు’ అని వైవీ రెడ్డి తన పుస్తకంలో వెల్లడించారు.

మరిన్ని వార్తలు