జీ షేరు ఢమాల్‌ : కంపెనీ వివరణ

8 May, 2019 14:41 IST|Sakshi
ఎస్సెల్‌ గ్రూపు ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర, ఆయన కుమారులు

సాక్షి, ముంబై : ఎస్సాల్‌ గ్రూప్‌నకు చెందిన జీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్ల భారీ పతనం  వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది.  2019 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి సంస్థ  ఆర్థిక నివేదికల ఆడిట్‌,  ప్లెడ్జ్‌డ్  (తనఖా) షేర్లు విక్రయంపైమంగళవారం నుంచి  పుకార్లు చెలరేగడంతో ఇన్వెస్లర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.  దీంతో  బుధవారం  జీ  కౌంటర్‌  ఏకంగా 12 శాతానికి పైగా పతనమైంది.

మరోవైపు ఈ పుకార్లను కొట్టి పారేసిన సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్లెడ్జ్‌డ్ షేర్ల  విక్రయం చోటు చేసుకోలేదని స్పష్టం  చేసింది. అలాగే వాటా విక్రయ అంశం తుది దశకు చేరుకుందంటూ  ఒక ప్రకటన విడుదల చేసింది. మరో 6-8 వారాల్లో ఈ విక్రయాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. అయితే వివరాలను వెల్లడి చేయలేమని, రుణాలను తీర్చడానికే మొదటి  ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ  సీఈవో పునీత్‌ గోయంకా స్పష్టం చేశారు. అలాగే షేరు విలువ అనూహ్య పతనం, వదంతులపై సెబీకి  ఫిర్యాదు చేయనున్నామని గోయంకా తెలిపారు.  2018-19  ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టాండ్‌లోన్‌ ఫలితాలను మే 27వ తేదీన వెల్లడించ నున్నామన్నారు.

కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీని గట్టెక్కించేందుకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 50 శాతం వాటాలను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయిస్తామని సంస్థ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీంతో గత ఏడు నెలల కాలంగా  జీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ షేరు విలువ తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. 

మరిన్ని వార్తలు