సోనీ చేతికి టెన్‌స్పోర్ట్స్

1 Sep, 2016 00:13 IST|Sakshi
సోనీ చేతికి టెన్‌స్పోర్ట్స్

స్పోర్ట్స్ నెట్‌వర్క్ విక్రయానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఒప్పందం
* డీల్ విలువ రూ.2,579 కోట్లు...

న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎంటర్‌ప్రైజ్(జీల్) తన స్పోర్ట్స్ చానెల్ నెట్‌వర్క్.. టెన్ స్పోర్ట్స్‌ను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్(ఎస్‌పీఎన్)కు విక్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించి కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు జీల్ బుధవారం వెల్లడించింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 38.5 కోట్ల డాలర్లు(దాదాపు రూ.2,579 కోట్లు)గా పేర్కొంది. ఎస్‌పీఎల్‌తో ఈ మేరకు తమ సబ్సిడరీలతో పాటు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు తెలిపింది.  

జీల్‌కు చెందిన స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్ ప్రస్తుత సబ్సిడరీ తాజ్ టీవీ లిమిటెడ్-మారిషస్ నేతృత్వంలో ఉంది. టెన్ బ్రాండ్ టీవీ చానల్స్ ప్రసార, పంపిణీ కార్యకలాపాలన్నీ ఈ సంస్థే చూస్తోంది. అయితే, భారత్‌లో దీనికి సంబంధించిన డౌన్‌లింకింగ్, పంపిణీ, మార్కెటింగ్, యాడ్‌లు ఇతరత్రా అంశాలన్నీ ఎక్స్‌క్లూజివ్ ఏజెంట్ అయిన తాజ్ టెలివిజన్(ఇండియా) చేపడుతోంది. కాగా, టెన్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కొనుగోలుతో క్రికెట్, ఫుట్‌బాల్, ఫైట్ స్పోర్ట్స్ విభాగాల్లో తమ వీక్షకులకు మరింత కంటెంట్ అందుబాటులోకి వస్తుందని; దేశీ, విదేశీ స్పోర్టింగ్ ప్రాపర్టీకి అదనపు బలం చేకూరుతుందని ఎస్‌పీఎన్ ఇండియా సీఈఓ ఎన్‌పీ సింగ్ పేర్కొన్నారు.
 
జీల్ 2015-16 కన్సాలిడేటెడ్ ఆదాయంలో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్ వాటా రూ.631 కోట్లుగా నమోదైంది. అయితే, ఈ విభాగం రూ.37.2 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. టెన్ స్పోర్ట్స్‌ను జీల్ దుబాయ్ పారిశ్రామికవేత్త అబ్దుల్ రహమాన్ బుఖాతిర్‌కు చెందిన తాజ్ గ్రూప్ నుంచి 2006లో కొనుగోలు చేసింది. ఈ నెట్‌వర్క్‌లో టెన్-1, 1హెచ్‌డీ, 2, 3, గోల్ఫ్ హెచ్‌డీ, క్రికెట్, స్పోర్ట్స్ ఉన్నాయి. భారత్ ఉపఖండం, మాల్దీవులు, సింగపూర్, హాంకాంగ్, మధ్య ప్రాచ్యం, కరేబియన్ తదితర దేశాల్లో ఈ చానెల్స్ ప్రసారం అవుతున్నాయి. కాగా, వివిధ నియంత్రణ సంస్థల ఆమోదానికిలోబడి ఒప్పందం పూర్తవుతుందని జీల్ వెల్లడించింది.

మరిన్ని వార్తలు