జెన్‌ టెక్‌ భళా- ఎక్సైడ్‌ బోర్లా

8 Jun, 2020 15:25 IST|Sakshi

Q4 ఫలితాల ఎఫెక్ట్‌

జెన్‌ టెక్‌.. హైజంప్‌

ఎక్సైడ్‌ షేరు పతనం

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డిఫెన్స్‌ శిక్షణా సొల్యూషన్స్‌ అందించే జెన్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో ఆటోమోటివ్‌ బ్యాటరీల దిగ్గజం ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లో జెన్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

జెన్‌ టెక్నాలజీస్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జెన్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 46 శాతం ఎగసి రూ. 18.5 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే ఇది 81 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం మాత్రం 56 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. కాగా.. సీఎఫ్‌వోగా అశోక్‌ అట్లూరి ఎంపికకు బోర్డ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో జెన్‌ టెక్నాలజీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 50.7 వద్ద ఫ్రీజయ్యింది. 

ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆటో బ్యాటరీల దిగ్గజం ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 20 శాతం నీరసించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. నికర టర్నోవర్‌ సైతం రూ. 2599 కోట్ల నుంచి రూ. 2055 కోట్లకు క్షీణించింది. పూర్తిఏడాదికి(2019-20) సైతం ఎక్సైడ్‌ నికర లాభం రూ. 844 కోట్ల నుంచి రూ. 826 కోట్లకు వెనకడుగు వేయగా.. మొత్తం ఆదాయం రూ. 10588 కోట్ల నుంచి రూ. 9857 కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం పతనమై రూ. 159కు చేరింది.

మరిన్ని వార్తలు