నానో తయారీ లేదు... అమ్మకాలూ లేవు

6 Feb, 2019 05:43 IST|Sakshi

జనవరిలో పరిస్థితి ఇది...

ఇది నిలిచిపోవచ్చన్న అంచనాలకు బలం

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ చిన్న కారు నానో జనవరిలో ఒక్కటీ అమ్ముడుపోలేదు. అంతేకాదు, ఒక్క నానోను కూడా తయారు చేయలేదు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి నూతన భద్రతా ప్రమాణాలు, 2020 ఏప్రిల్‌ నుంచి వచ్చే బీఎస్‌–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా నానో కారును ఆధునీకరించే ప్రణాళికలు ఏవీ లేవని ఇటీవలే టాటా మోటార్స్‌ సేల్స్‌ విభాగం హెడ్‌ ప్రకటించిన విషయం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో ఒక్కనానో కారును కూడా తయారు చేయలేదని, గతేడాది ఇదే నెలలో మాత్రం 83 నానో కార్లను తయారు చేసినట్టు టాటా మోటార్స్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇక 2018 జవవరిలో దేశీయ మార్కెట్లో 62 నానో కార్లు అమ్ముడుపోగా, 2019 జనవరిలో ఒక్క నానో కూడా విక్రయం కాలేదని టాటా మోటార్స్‌ తెలిపింది.

ఇక ఎగుమతుల విషయానికొస్తే గత నెలలో ఒక్క యూనిట్‌ను ఎగుమతి చేయలేదని, గతేడాది ఇదే నెలలోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించింది. ఈ విషయమై టాటా మోటార్స్‌ కంపెనీ ప్రతినిధిని మీడియా ప్రశ్నించగా... ప్రస్తుత రూపంలో ఉన్న నానో నూతన భద్రతా, కాలుష్య ప్రమాణాలను చేరలేదని, కొత్త పెట్టుబడులు అవసరమని చెప్పారు. ఈ విషయంలో ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కస్టమర్ల నుంచి డిమాండ్‌ ఉంటే నానోను తయారు చేస్తామని చెప్పారు. టాటా మోటార్స్‌ గతేడాది జూన్‌లో ఒక్క నానో కారును తయారు చేయగా, అదే నెలలో దేశీయ మార్కెట్లో మూడు నానో వాహనాలను విక్రయించింది. మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని టాటా మోటార్స్‌ నానో కారును తొలిసారిగా 2008లో మార్కెట్‌కు పరిచయం చేసింది. కానీ, వినియోగదారుల నుంచి ఆశించిన ఆదరణ దక్కలేదు.  

మరిన్ని వార్తలు