జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్‌..

21 Jan, 2020 14:38 IST|Sakshi

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం జొమాటో... మరో ఫుడ్‌ డెలివరీ సంస్థ ఉబర్‌ ఈట్స్‌ ను కొనుగోలు చేసింది.  ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ కు చెందిన  ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ ను కొనుగోలు చేసినట్లు జొమాటో మంగళవారం ప్రకటించింది. ఆల్‌ స్టాక్‌ ఒప్పందంలో భాగంగా జొమాటో ఈ మేరకు కొనుగోలు చేసింది. ఇకపై ఉబెర్ ఈట్స్ తన కార్యకలాపాలను ప్రత్యక్షంగా నిలిపివేసి అనుబంధ సంస్థ జొమాటోటోకు బదిలీ చేయనుంది. కాగా గతంలోనే ఉబెర్‌ ఈట్స్‌ను జోమాటో కొనుగోలు చేస్తున్నట్లు అనేక వార్తలు వెలుబడిన విషయం తెలిసిందే. నివేదికల ప్రకారం  350 మిలియన్‌ డాలర్లకు(భారత కరెన్సీ ప్రకారం రూ. 2,485 కోట్లు) డీల్‌ కుదుర్చుకొని ఉబెర్ ఈట్స్‌ను జొమాటో తన వశం చేసుకుంది. ఇక ఈ ఒప్పందం మంగళవారం నుంచి అములులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉబెర్ ఈట్స్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వారి భవిష్యత్తు ఏంటనేది స్పష్టత ఇవ్వలేదు. 

కాగా ఉబర్‌కు 10 శాతం వాటాను ఇవ్వనున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు. ‘‘ఉబెర్ ఈట్స్‌ ఇండియా ఇప్పుడు జొమాటోగా మారింది. ఇకపై వినియోగదారులకు మరింత రుచికరమైన ఆహారాన్ని అందించనున్నాం. ఇది కొత్త ప్రయాణం’’ అని ట్వీట్‌ చేశారు. అలాగే దేశంలోని 500నగరాలకు పైగా జొమాటో తన సేవలను అందిస్తోందని తెలిపారు. ఉబెర్ ఈట్స్‌ను 2017లో ప్రారంభించారు. అప్పటికే ఉన్న జొమాటో, స్విగ్గీ వంటి వాటితో పోటీపడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్కెట్‌ను నిలబెట్టుకోలేకపోయింది.  భారతదేశంలో ఉబెర్ ఈట్స్ గత రెండేళ్లుగా భారీ మొత్తాన్ని ఆర్జించిందని ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి అన్నారు. భారతదేశంలో ఉబెర్‌కు మంచి మార్కెట్‌ ఉందని, ఇకపై తమ రైడింగ్‌ బిజినెస్‌ను పెంచుకోడానికి పెట్టుబడులు పెడతామని ఆయన పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు