జూమ్‌ కొత్త టెక్‌ సెంటర్‌, కొత్త ఉద్యోగాలు

21 Jul, 2020 15:56 IST|Sakshi

బెంగళూరులో టెక్నాలజీ సెంటర్‌ 

అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల నియామకాలు త్వరలో

ఇప్పటికే ముంబైలో ఒక డేటా సెంటర్‌

సాక్షి, బెంగళూరు : కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ కాలంలో ఏర్పడిన  భారీ డిమాండ్‌తో దూసుకుపోయిన అమెరికాకు చెందిన యాప్  జూమ్‌ మరింత విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులో  కొత్త టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించనున్నామని మంగళవారం  ప్రకటించింది.  అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించిన నియామ​కాలను కూడా ప్రారంభిస్తామని వెల్లడించింది.

జూమ్‌కు ఇప్పటికే ముంబైలో ఒక కార్యాలయం, డేటా సెంటర్‌ ఉంది. తాజాగా బెంగళూరులో రెండవ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది తమ ప్లాట్‌ఫాంను మరింత మెరుగుపరిచేందుకు ఇన్నోవేషన్ హబ్‌గా ఉంటుందని,  రాబోయే కొన్నేళ్లలో ఇక్కడ అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను నియమించుకోవడానికి కూడా కట్టుబడి ఉన్నామని  ప్రొడక్షన్‌​ అండ్‌ ఇంజనీరింగ్‌ ప్రెసిడెంట్‌ వెల్చమీ శంకర్‌ లింగ్‌  వెల్లడించారు. ఈ వ్యూహాత్మక పెట్టుబడులు తమ నిబద్దతకు సూచికని చెప్పారు. 

దేశంలో నిరంతర వృద్ధి, పెట్టుబడులపై ఆశావహంగా ఉన్నామని, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో 2,300కి పైగా విద్యాసంస్థలకు తమ సేవలను ఉచితంగా అందించడం గర్వకారణమని జూమ్ సీఈఓ ఎరిక్ఎస్ యువాన్ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా చాలా విద్యా ,ఇతర సంస్థలు వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం జూమ్‌ను ఆశ్రయించడంతో, 2020 జనవరి-ఏప్రిల్ మధ్య 67శాతం వృద్ధిని సాధించింది. సిస్కో సిస్టమ్స్ వెబెక్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌, గూగుల్ మీట్ లాంటి వీడియో కాన్ఫరెన్స్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడుతోంది. తాజాగా రిలయన్స్ జియోమీట్, అమెరికా టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ వెరిజోన్‌తో కలిసి ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన బ్లూజీన్స్‌ కూడా ఈ వరుసలో చేరాయి. ఈ నేపథ్యంలోనే జూమ్‌ విభిన్న వ్యూహాలతో మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

కాగా జూమ్ "సురక్షితమైన వేదిక కాదు" అని కేంద్రం గతంలో చెప్పింది. సెక్యూరిటీ రీత్యా అంత మంచిది కాదని సూచించిన ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల అధికారిక సమావేశాలకు ఈ యాప్‌ను వినియోగించ వద్దని హెచ్చరించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు