జైడస్‌ క్యాడిలా క్లినికల్ పరీక్షలు షురూ

15 Jul, 2020 14:32 IST|Sakshi

కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ అభివృద్ధి

వెల్లడించిన క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ

ఇప్పటికే ప్రీక్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్‌

కరోనా వైరస్‌ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించినట్లు దేశీ హెల్త్‌కేర్‌ కంపెనీ జైడస్‌ క్యాడిలా తాజాగా వెల్లడించింది. వ్యాక్సిన్‌కు సంబంధించి క్లినికల్‌ జీఎంపీ బ్యాచ్‌లను ఇప్పటికే తయారు చేసినట్లు పేర్కొంది. తద్వారా దేశీయంగా వివిధ ప్రాంతాలలో ఈ నెలలోనే  క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించినట్లు తెలియజేసింది. జులై 4న నమోదైన దేశీ క్లినికల్‌ ట్రయల్‌ రిజస్ట్రీ(సీటీఆర్‌ఐ) గణాంకాల ప్రకారం తొలి దశ పరీక్షలు 84 రోజుల్లోగా పూర్తికానున్నట్లు తెలుస్తోంది. తదుపరి మరో 84 రోజులపాటు రెండో దశ పరీక్షలను నిర్వహించనున్నట్లు డేటా వెల్లడిస్తోంది. తద్వారా వ్యాక్సిన్‌ ప్రభావం, భద్రత తదితర అంశాలను పరిగణించనున్నట్లు డేటా తెలియజేసింది. తొలి దశ క్లినికల్‌ పరీక్షలను అహ్మదాబాద్‌లోని జైడస్‌ రీసెర్చ్‌ సెంటర్‌లోసైతం నిర్వహిస్తున్నట్లు సీటీఆర్‌ఐ డేటా పేర్కొంది.

ప్రీక్లినికల్‌ ఓకే
కోవిడ్‌-19 కట్టడికి వీలుగా ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఈ నెల మొదట్లో జైడస్‌ క్యాడిలా పేర్కొన్న విషయం విదితమే. అహ్మదాబాద్‌లోని వ్యాక్సిన్‌ టెక్నాలజీ కేంద్రంలో రూపొందించిన ఈ ఔషధ ప్రీక్లినికల్‌ పరీక్షలను విజయవంతంగా ముగించినట్లు తెలియజేసింది. ఎలుకలు, కుందేళ్లు తదితర పలు జంతువులలో వ్యాధి నిరోధక శక్తి బలపడినట్లు జైడస్‌ క్యాడిలా ఇప్పటికే వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ వినియోగంతో తయారయ్యే యాంటీబాడీస్‌ కరోనా వైరస్‌ను నియంత్రిస్తున్నట్లు వివరించింది. తద్వారా మానవ క్లినికల్‌ పరీక్షలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతిని పొందినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా తొలి రెండు దశల క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు