ఆ ఇద్దరూ ఆడుతుంటే చూడటం గొప్పగా ఉంది: కోహ్లి

26 Oct, 2017 09:58 IST|Sakshi

పుణె: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్‌కు విజయాన్ని చేకూర్చిన బౌలర్లు, ఫీల్డర్లపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించారు. 'ఇది మాకు చాలా మంచి గేమ్‌. టాస్‌ వేసినప్పుడు ఏదైతే చెప్పామో అదే చేశాం. బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫీల్లర్లు సైతం బాగా ఆడారు' అని మ్యాచ్‌ అనంతరం కోహ్లి తెలిపారు. కీలకమైన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొంది.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసిన సంగతి తెలిసిందే. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో కీలకమైన రెండో వన్డేలో టీమిండియా అంచనాల మేరకు రాణించి ఆకట్టుకుంది.

'ఆ ఇద్దరూ (భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రిత్‌ బుమ్రా) చక్కగా ఆడుతుంటే చూడటం గొప్పగా ఉంది. తాము శుభారంభం ఇవ్వగలమని వారికి తెలుసు' అని కోహ్లి అన్నాడు. వికెట్‌ స్లోగా ఉన్నా.. సంప్రదాయపద్ధతిలో బౌలింగ్‌ చేస్తూ.. వికెట్లు పడగొట్టడం ఎంతో హృద్యంగా ఉందని చెప్పాడు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌ బాగా రాణించి.. మ్యాచ్‌ విజయంలో కీలకంగా నిలిచారని కొనియాడాడు.

కివీస్ నిర్దేశించిన 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే టీమిండియా చేరుకుంది.  మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లాడి 9 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) సిరీస్ లో మరోసారి విఫలమైనా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (84  బంతుల్లో 68: 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రమోషన్ పొందిన దినేశ్ కార్తీక్ (64 నాటౌట్) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ కోహ్లీ(29 బంతుల్లో 29: 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాక క్రీజులోకొచ్చిన హార్ధిక్ పాండ్యా (30) పరవాలేదనిపించాడు.  ధోని (18)తో కలిసి దినేశ్ కార్తీక్ భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. కివీస్ బౌలర్లలో సౌధీ, మిల్నే, శాంట్నర్, డి గ్రాండ్ హోమ్మీ తలో వికెట్ తీశారు.

మరిన్ని వార్తలు