ఆ కుటుంబంలో అందరిదీ 111 ఏళ్ళ వయసే!

17 Jan, 2018 16:51 IST|Sakshi

పెద్దతిప్పసముద్రం: వారి పొరపాటు వీరికి గ్రహపాటుగా మారింది. ఓ కుటుంబానికి చెందిన రేషన్‌ కార్డులో కుటుంబ యజమాని, భార్య, కుమారుడికి అందరికీ ఒకేలా 111 ఏళ్ళ వయసు నమోదు అయి ఉంది. ఇది ఎలా నమోదైంది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆదాయ ధ్రువీకరణ, పుట్టిన తేదీ ధ్రువపత్రాల కోసం వెళితే రేషన్‌ కార్డులో పేర్కొన్న వయసు అడ్డొస్తోంది. దీంతో కార్డులో వయసును మార్చుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచక ఆ కుటుంబీకులు సతమతమవుతున్నారు. చిత్తూరుజిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలోని యంపార్లపల్లికి చెందిన గుట్టపాళ్యం వెంకట్రమణ పేరిట డబ్ల్యూఎపి 1004007ఏ0166 నంబర్‌ గల రేషన్‌ కార్డు ఉంది. వ్యవసాయ పనులే ఈయన జీవనాధారం. వాస్తవంగా వెంకట్రమణకు 55 ఏళ్లు, భార్య అమరమ్మకు 45ఏళ్లు, కుమారుడు మురళీధర్‌ రెడ్డికి 18 ఏళ్ళ వయసు. మురళీధర్‌రెడ్డి పుత్తూరులోని ఓ కాలేజీలో బిటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నెల క్రితం అతనికి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం అవసరం వచ్చింది. కాలేజీ అధికారులు వీరి రేషన్‌ కార్డు నంబర్‌ను ఆన్‌లైన్‌లో క్లిక్‌ చేయగా ఇతనికి 111 ఏళ్లు, అలాగే అతని తల్లిదండ్రులకూ 111 ఏళ్ళ వయసు నమోదై ఉండటాన్ని గమనించి అవాక్కయ్యారు. దీంతో కార్డులోని వయసును సవరించాలంటూ ఆ కుటుంబీకులు మీ-సేవ కేంద్రానికి వెళ్లారు. అయితే వయసు మార్పు చేసే ఆప్షన్‌ ఏదీ లేదని మీ-సేవ నిర్వాహకులు స్పష్టం చేశారని వెంకట్రమణ వాపోయాడు. అధికారుల తప్పిదాల కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఎక్కడికి వెళ్ళి సవరణ చేయించుకోవాలో పాలుపోవడం లేదని కార్డుదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు