ముద్దు కృష్ణమనాయుడికి ప్రముఖుల నివాళి

7 Feb, 2018 09:38 IST|Sakshi
ముద్దు కృష్ణమనాయుడికి ప్రముఖుల నివాళి

సాక్షి, హైదరాబాద్‌ : మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం పలువురు ప్రముఖులు కేర్‌ ఆస్పత్రిలోని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. నివాళులు అర్పించిన వారిలో ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎల్‌ రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, డీకే సమరసింహారెడ్డి, జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, లక్ష్మీపార్వతి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ గాలి ముద్దుకృష్ణమనాయుడి అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్టీఆర్‌ పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. మంచైనా, చెడైనా అందరికీ అండగా ఉండే వ్యక్తి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ఏ పదవిలో ఉన్నా అంకితభావంతో పనిచేశారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఎన్టీఆర్‌తో పని చేసినా, చంద్రబాబుతో పని చేసినా మంచి పేరు ఉంది. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా’ అని అన్నారు.

సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
గాలి కృష్ణమనాయుడు హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాగే మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, వైఎస్‌ఆర్‌ సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ముఖ్య భూమిక పోషించారని, క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబసభ్యులుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాలి ముద్దుకృష్ణమనాయుడి మృతిపట్ల గవర్నర్‌ నరసింహన్‌ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

మంత్రిగా, ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి ముద్దు కృష్ణమనాయుడని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీకి, రాష్ట్ర ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారని తెలిపారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం తెలుగుదేశం పార్టీకి, చిత్తూరు జిల్లాకు తీరనిలోటుగా అభివర్ణించారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం
గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతిపట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముద్దుకృష్ణమనాయుడు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిరాడంబరుడిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు