రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం

31 Dec, 2017 06:37 IST|Sakshi

వైకుంఠ ఏకాదశికి విపరీతంగా భక్తుల రద్దీ

 తిరుమల జేఈఓ కేఎస్‌.శ్రీనివాసరాజు 

 జనవరి 1న ఉదయం 2.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభం 

సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించామని తిరుమల జేఈఓ కేఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం జేఈఓ మీడియాతో మాట్లాడారు. ఏకాదశిలో  విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏకాదశి, వైకుంఠద్వార దర్శనానికి తమ అంచనాలకు మించి 40 వేల మంది భక్తులు అదనంగా క్యూలో వేచి ఉన్నారని తెలిపారు. క్యూలు 4 కిలోమీటర్ల మేర విస్తరించాయని, ఔటర్‌ రింగ్‌రోడ్డులో మరో 2 కిలోమీటర్ల క్యూ పెరిగిందని వివరించారు. సాధారణంగా తిరుమలలో ఈనెల సంవత్సరాంతపు రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈసారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల వల్ల రద్దీ రెండింతలైందని తెలిపారు.

 వైకుంఠ ఏకాదశిరోజు 74,012 మంది, ద్వాదశిరోజు సాయంత్రం 7 గంటల వరకు 75,658 మంది కిలిపి రెండు రోజుల్లో దాదాపు 1.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. మరికొన్ని గంటలో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుందని, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో రికార్డు స్థాయిలో 20 వేల మందికి అదనంగా దర్శనం చేయిం చామని వెల్లడించారు. భక్తుల రద్దీకి తగ్గట్టు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విశేషంగా సేవలందించారని జేఈఓ కొనియాడారు. బయటి క్యూలను క్రమబద్ధీకరించేందుకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మొహంతి, ఇతర పోలీసు సిబ్బంది బాగా కష్టపడ్డారని వారిని అభినందించారు.

 నూతన ఆంగ్ల సంవత్సరం ఏర్పాట్లపై మాట్లాడుతూ జనవరి 1న ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవన్నారు. జనవరి 1న సోమవారం వేకువజామున 2 గంటలకు ధనుర్మాస కైంకర్యాలు, తిరుప్పావై అనంతరం 2.30 నుంచి 5.30 గంటలకు వరకు సర్వదర్శనం ఉంటుం దని తెలిపారు. నైవేద్య విరామం అనంతరం ఉదయం 6 గంటల నుంచి పరిమిత సంఖ్యలో ప్రోటోకాల్‌ ప్రముఖులకు బ్రేక్‌ దర్శనం ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎలాంటి అంతరాయం లేకుండా సర్వదర్శనం కొనసాగుతుందని తెలిపారు. జనవరి 1వ తేదీ వరకు దివ్యదర్శనం టోకెన్లు, ఆర్జితసేవలు రద్దు చేసినట్టు జేఈవో తెలిపారు. 

మరిన్ని వార్తలు