అడుగడుగునా ఆత్మీయతే

1 Jan, 2018 08:42 IST|Sakshi

రాజన్న బిడ్డకు నీరాజనం

జాతరలా సాగిన ప్రజా సంకల్పయాత్ర

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఎండనబడి తిరుగుతుండవ్‌ బిడ్డా.. యాడబడితే ఆడ తినమాకు మరి..ఆరోగ్యం జాగరత నాయనా... 

ఆరుపదుల వయసు దాటిన అవ్వ సలహా. 
నువ్వేం బేజారవ్వొద్దు నాయనా.. ఈ సారి నువ్వే గెలుస్తావ్‌.. ఉద్యోగస్తులంతా నీ వెంటే ఉన్నారు ..      
– రిటైర్డ్‌ టీచర్‌ సుశీలమ్మ దీవెన

అన్నా.. ఈసారి నిన్ను గెలిపించుకు తీరతాం. నువ్వు సీఎం అయితేనే రాష్ట్రం బాగు పడుద్ది..
 – తమ్ముడు మునిరాజప్ప ఆశాభావం

.. వీరందరిదీ ఒకటే ఆకాంక్ష. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని. ఆదివారం తంబళ్లపల్లె మండలంలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో అభిమానుల ఆత్మీయత, అనురాగాలు వైఎస్‌ జగన్‌ను కట్టిపడేశాయి. 

పాదయాత్ర సాగిందిలా..
ఉదయం 8 గంటకు మూలపల్లెక్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభానికి ముందే పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో మాట్లాడారు. ఆదివారం నాటి పాదయాత్రకు వెళ్లాల్సిన గ్రామాల గురించి వివరించారు. యాత్ర ప్రారంభం కాగానే కస్తూర్బా బాలికా విద్యాలయం టీచర్లు రాణి, స్వర్ణలత జగన్‌ను కలిసి ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుపై వినతిపత్రం అందించారు. డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం ప్రతినిధులు గుంటి వేణుగోపాల్, హరికృష్ణ తమకు ఎదురవుతున్న ఇక్కట్లను వివరించారు. ఎర్రసానివారిపల్లెకు చేరుకోగానే వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు విష్ణువర్దన్‌రెడ్డి, ప్రసాదరెడ్డి రెండేళ్లుగా ఎదురవుతున్న ఇక్కట్లను వివరించారు. ఎర్రసానిపల్లె శివారులో ఎదురుచూస్తున్న టమాట రైతులు రామకృష్ణ, శంకర్, సురేందర్‌రెడ్డిని పలకరించేందుకు టమాట పొలాల్లోకి జగన్‌ వెళ్లారు. 

అక్కడి నుంచి ఎద్దులవారిపల్లె చేరుకున్న వైఎస్‌ జగన్‌ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. ఇదే గ్రామంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, సుందరంగా అలంకరించిన ఇంట్లో జగన్‌ రాకకోసం మహిళలు ఎదురు చూశారు. కే రామిగానివారిపల్లెలో రోడ్డు పక్కనున్న వికలాంగునికి ధైర్యం చెప్పి ముందుకు సాగిన వైఎస్‌ జగన్‌కు రేణుమాకులపల్లె దగ్గర పీలేరు, కలకడ, మదనపల్లె ప్రాంతాలకు చెందిన సంఘమిత్రలు ఎదురయ్యారు. ఇదే గ్రామంలో పింఛను రాక ఇక్కట్లు పడుతున్న జబ్బార్‌సాహెబ్‌ను జగన్‌ పలకరించారు. పక్కనే కదల్లేని స్థితిలో ఉన్న మెహర్‌బాషాకు ధైర్యం చెప్పారు. 

భారతీయ అంబేడ్కర్‌ సేన ప్రతినిధులు అందజేసిన వినతిపత్రాన్ని పరిశీలించా రు. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గ సమన్వయకర్త శెట్టి ఫాల్గుణ ప్రత్యేకంగా తయారు చేయిం చిన న్యూ ఇయర్‌ కేలండర్‌ను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిమ్మయ్యగారిపల్లెలో భోజన విరామం తీసుకున్న పార్టీ నాయకులు తిరిగి 3 గంటలకు మొదలుపెట్టి 6 గంటలకు ముదివేడులో ముగించారు. 

పాదయాత్రలో నాయకులు
పాదయాత్రలో ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్‌రెడ్డి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఆదికేశవులురెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ చెన్నై కమిటీ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, పలమనేరు కో–ఆర్డినేటర్లు రాకేష్‌రెడ్డి,  జెడ్పీ మాజీ చైర్మన్‌ రెడ్డెమ్మ, పార్టీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతనాయక్, సత్యవేడు కో–ఆర్డినేటర్‌ ఆదిమూలం, గుంటూరు యువజన విభాగం నేత చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

డీఎస్సీలో వెయిటేజీ కోసం..
కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందంటూ స్వర్ణలత అనే దివ్యాంగురాలి తో పాటు రాణి మరికొందరు మహిళలు వైఎస్‌.జగన్‌కు నివేదించారు. తంబళ్లపల్లెలోని మూలపల్లెక్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. 2005 నుంచి సర్వశిక్షా అభయాన్‌లో రూ.2,500 వేతనంతో  పనిచేస్తున్నామన్నారు. అలాంటి తమకు డీఎస్పీలో వెయిటేజీ ఇవ్వాలని కోరారు. డీఎస్సీలో ఆర్థో విభాగంలో ఉన్న దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని విన్నవించారు. 
– చిత్తూరు అర్బన్‌

సంకల్ప దివి‘టీ’!
ఆయన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వీరాభిమాని. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా సాగుతుండడంతో కన్నెమడుగు పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన టీ వ్యాపారి రామకృష్ణ తన ఇంట పండగ చేసుకున్నాడు. వైఎస్సార్‌ చిత్రపటానికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి హారతులు పట్టారు. 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. 
– తంబళ్లపల్లె

‘రెండు’వేల కళ్లతో..!
నాకు ఎవరూ లేరు. నెలనెలా వచ్చే వెయ్యి రూపాయల పింఛనే దిక్కు. అది ఏ మూలకు సరిపోతోంది..?. జగన్‌ సామీ వస్తే పింఛను రెండు వేలు చేస్తాడంట. ఆ సామి రావాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నా..’ అంటూ తంబళ్లపల్లె మండలం కే రామిగానివారిపల్లెకు చెందిన కృష్ణమ్మ(70) ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్నబిడ్డను చూసిపోదామని వచ్చినట్లు ఆమె తెలిపారు. 
– పలమనేరు
  
సర్వరక్షణ మీరే!
భయ్యా.. తుమ్‌కో సీఎం కర్‌నేకేలియే మే అల్లాసే దువా కర్‌దియా (అన్నా.. మీరు సీఎం కావాలని అల్లా వద్ద ప్రార్థనలు చేశా).. అంటూ పెద్దమండ్యానికి  చెందిన అమీర్‌బాషా వైఎస్‌.జగన్‌ చేతికి సర్వరక్షణ కంకణాన్ని కట్టారు. దఫేదార్‌గా పనిచేస్తూ రిటైర్‌ అయిన తాను అజ్మీర్‌కు వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. 
– చిత్తూరు అర్బన్‌

ఆ వైద్యసేవ ఎందుకు?
రెండు కిడ్నీలు చెడిపోయిన భర్త ఆర్‌.మల్లికార్జునను కాపాడుకునేందుకు ఆస్పత్రికి వెళ్తే ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) అక్కరకు రాలేదని తంబళ్లపల్లె మండలం రేణిమాకులపల్లె పంచాయతీకి చెంది న ఆర్‌.మంజుల ఆవేదన వ్యక్తం చేసింది. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆమె తన దీన గాథను తెలియజేసింది. భర్త రెండు కిడ్నీలు బాగుచేసుకోవడానికి ఉన్న వంద గొర్రెలమ్మినా ఫలితం లేకుండాపోయిందని వాపోయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆపరేషన్‌కు రూ.10 లక్షలు అవుతుందని, అయితే ఇక్కడ ఎన్టీఆర్‌ వైద్యసేవలు వర్తించవని తిప్పిపంపినట్లు జగన్‌కు వివరించింది.  
– బి.కొత్తకోట 

మరిన్ని వార్తలు