వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

12 Dec, 2017 15:48 IST|Sakshi

తిరుమల: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 29న ఏకాదశి,30న ద్వాదశి రానుంది. ఏకాదశి శుక్రవారం రావటంతో శ్రీవారి దర్శనం నాలుగు గంటలు ఆలస్యం కానుంది. ఏకాదశి నాడు ఉదయం ఐదున్నర గంటలకు వీఐపీ దర్శనం,8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు దివ్య దర్శనం, ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

రాజ్యంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏకాదశినాడు ఆరు వీఐపీ దర్శన టికెట్లు, రాజ్యాంగేతర వీఐపీలకు నాలుగు వీఐపీ దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులను 28న ఉదయం 10 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతిస్తామని జేఈఓ చెప్పారు. తిరుమలలో అదనంగా ఆరు కిలొమీటర్ల క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ద్వాదశి నాడు వీఐపీ దర్శనాలు రద్దు చేశామని, భక్తులకు నిరంతరం ఆహారం, నీరు అందిస్తామని జేఈఓ అన్నారు.

మరిన్ని వార్తలు