మేయర్‌ భాగ్యం లేదాయె!

6 Feb, 2018 09:48 IST|Sakshi
తిరుపతి

కలగా మిగిలిన తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికలు

ఎన్నికలంటే వణుకుతున్న అధికార పార్టీ నేతలు

వైఎస్‌ మరణం తర్వాత ఎన్నికలకు సాహసించని ఆ ‘ముగ్గురు’

పదహారేళ్ల కిందట ఎన్నికలు మున్సిపాలిటీగా ఉన్న తిరుపతికి పదహారేళ్ల కింద ట 2002 జనవరి 29న ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కందాటి శంకర్‌రెడ్డి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 2007 ఫిబ్రవరి 5 నాటికి మున్సిపల్‌ పాలకమండలి పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత మేజర్‌ మున్సిపాలిటీలను కార్పొరేషన్‌ హోదా కల్పించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2007 మార్చి 31న ఎంఆర్‌  పల్లి, రాజీవ్‌నగర్, తిమ్మినాయుడుపాలెం పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఆ సమయంలో గ్రామాల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించింది. అనంతరం 2009లో తిరుపతి మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా కల్పించింది. ఆ తర్వాత డివిజన్ల విభజన, ఓటర్ల నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఇలా అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నా  వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రహణం పట్టింది.

సాక్షి, తిరుపతి: దినదినాభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరానికి మేయర్‌ కరువయ్యాడు. కార్పొరేషన్‌ హోదా లభించి సంవత్సరాలు గడుస్తున్నా కోర్డులో కేసులంటూ ఎన్నికలు నిర్వహించటానికి అధికారపార్టీ సాహసం చేయలేకపోతోంది. చివరకు గత ఏడాది ఎన్నికలు ఉంటాయని హడావుడి చేసింది. డివిజన్ల రిజర్వేషన్లు కూడా ప్రకటించి చివరకు చేతులెత్తేసింది.

ఎన్నికలకు వెళ్లే సాహసం లేదా?
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజన తర్వాత సీఎం అయిన చంద్రబాబు తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించే సాహసం చేయలేకపోయారు. ఓటర్ల నమోదులో భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేశారంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దాన్ని అదునుగా చూపిస్తూ అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి, నేటి సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఆ వాయిదాల వెనుక ఆ సమయంలో ఉన్న ప్రభుత్వ పెద్దలపై తీవ్ర వ్యతిరేకతే ఉందనే కారణంతో వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు సీఎం అయ్యాక స్థానిక టీడీపీ నేతలు మేయర్‌ కుర్చీపై ఆశలు పెట్టుకున్న కొందరు టీడీపీ నేతలు అధినేత వద్ద తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల ప్రస్తావన తీసుకెళ్లారు. అందులో భాగంగా గత ఏడాది సెప్టెంబర్, ప్రస్తుత ఏడాది జనవరిలో రెండు పర్యాయాలు సర్వేలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే ఏ సర్వేలోనూ టీడీపీకి అనుకూలంగా రాలేదని తెలిసింది. అందువల్లే నవంబర్‌లో ఎన్నికలు ఉంటాయని చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రస్తుతం ఆ ప్రస్తావన తీసుకు రాలేదు. ఇటీవల తిరుపతికి చెందిన కొందరు టీడీపీ నేతలు సచివాలయంలో సీఎంను కలిసి కార్పొరేషన్‌ ఎన్నికల విషయం గురించి గుర్తు చేసినట్లు సమాచారం. ‘ఈ పరిస్థితుల్లో ఎన్నికలు అవసరమా?’ అని సీఎం పార్టీ ముఖ్య నేతలకు షాక్‌ ఇచ్చినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించే సాహసం చేసే పరిస్థితి లేదనే ప్రచారం జరుగుతోంది. ఇలా ముగ్గురు సీఎంల నిర్ణయంతో తిరుపతి నగరం మేయర్‌ని చూసే అవకాశాన్ని కోల్పోతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు