వైకుంఠ ఏకాదశికి టీటీడీ సిద‍్ధం

27 Dec, 2017 20:25 IST|Sakshi

గురువారం అర్థరాత్రి 12.01 గంటలకు తెరుచుకోనున్న వైకుంఠ ద్వారం 

శుక్రవారం ఉ:4 గంటల నుండి వీపీలు, తర్వాత ఉ:8 నుండి సర్వదర్శనం

కాలిబాట టికెట్ల జారీ నిలిపివేత

సాక్షి, తిరుమల: పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు వైకుంఠవాసుని దర్శనం కల్పించేందుకు టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోటెత్తనున్నసామాన్య భక్తులతోపాటు వీఐపీ, ప్రముఖులకు బస, దర్శన ఏర్పాట్లు విసృతం చేసింది.

గురువారం అర్థరాత్రి  తర్వాత 12.01 గంటల నుండి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారం
తిరుమలలోని వైకుంఠ ద్వారం గురువారం అర్థరాత్రి తర్వాత 12.01 గంటలు (శుక్రవారం) తెరుచుకోనుంది. తొలుత ధనుర్మాసపూజలు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 4 గంటల నుండి భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. తొలుత ప్రొటోకాల్‌ నిబంధనలకు లోబడి కేంద్ర,రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఇలా వరుస క్రమంలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నారు. ఆ తర్వాతే ఉదయం 8 గంటల సామాన్య భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం అభిషేకం కారణంగా సామాన్య భక్తులకు ఈసారి నాల్గు గంటలపాటు స్వామి దర్శనం ఆలస్యం కానుంది. 

ప్రొటోకాల్‌ ప్రముఖులకే బస, దర్శనం.. సిఫారసు దర్శనాల్లేవు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశితోపాటు కొత్త సంవత్సరం పురస్కరించుకుని తరలివచ్చే భక్తుల నేపథ్యంలో టీటీడీ అన్ని రకాల వీఐపీ దర్శనాలు రద్దు చేసింది. 23వ తేది నుండే ప్రొటోకాల్‌ మినహా వీఐపీ దర్శనాలు టికెట్ల జారీ నిలిపివేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ప్రాధాన్యత దృష్ట్యా కేవలం ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారమే దర్శన టికెట్లు కేటాయించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వేలాది సంఖ్యలో సిఫారసు లేఖలు టీటీడీకి అందటం గమనార్హం. 

కాలిబాటతోపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు
గురువారం నుండి జనవరి 1వ తేది వరకు ఐదురోజులపాటు వృద్దులు, దివ్యాంగులు, చంటిబిడ్డ తల్లిదండ్రులు, కాలిబాట దివ్యదర్శనాలు రద్దు చేశారు. ఇందులో భాగంగా బుధవారం అర్థరాత్రి నుండి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో కాలిబాట దివ్యదర్శనం టికెట్ల జారీ నిలిపివేశారు. ఇక ఆలయంలో జరిగే  అన్ని రకాల నిత్య ఆర్జిత సేవల్ని కూడా రద్దు చేశారు. 

మరిన్ని వార్తలు