చిరుత అలజడి

27 Feb, 2018 01:56 IST|Sakshi

తిరుమలలో జంటలుగా సంచరిస్తున్న చిరుతలు

పట్టించుకోని టీటీడీ,  వన్యప్రాణి, అటవీ శాఖలు

భక్తులు, స్థానికుల్లో   పెరిగిన ఆందోళన

కంచె నిర్మించాలన్న  ప్రతిపాదన బుట్టదాఖలు

తిరుమల కొండపై చిరుతలు మాటు వేశాయి.  నిత్యం ఏదో ఓ మూలన సంచరిస్తూ భక్తులకు, స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పదిహేను రోజుల క్రితం  ఓ చిరుత బాలాజీ నగర్‌లోని ఇంట్లోకి చొరబడి కుక్కను ఎత్తుకెళ్లడం, తాజాగా ఆదివారం రాత్రి అదే ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులకు కనిపించింది. వీటి సంచారాన్ని  కట్టడి చేసేలా అటవీ ప్రాంతం చుట్టూ ఇనుప కంచె నిర్మాణ ప్రతిపాదనలను టీటీడీ వెంటనే అమలుచేయాలని  కోరుతున్నారు.

సాక్షి,తిరుమల:  వేసవికి ముందే  తిరుమల కొండపై చిరుతల సంచారం భక్తుల్లో భయాందోళనలను పెంచుతోంది. సుమారు  5.5 లక్షల హెక్టార్లలో విస్తరించిన శ్రీ వేంకటేశ్వర అభయారణ్యంలోని తూర్పున కడప జిల్లా నుంచి పశ్చిమాన తలకోన వరకు విస్తరించిన శేషాచల అడవుల పరిధిలో మొత్తం 50కిపైగా చిరుత పులులు సంచరిస్తున్నట్టు  సమాచారం. ఇందులో ఎక్కువ భాగం తిరుమల శివారు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్నాయి. 

జట్లుగా జనారణ్యంలోకి..
తిరుమలలో నాలుగు చిరుతలు సంచరిస్తున్నాయి. గతంలో ఒక్కొక్కటిగానే తిరిగేవి. ఇటీవల అవి రెండేసి చొప్పున జట్టుగా తిరుగుతున్నాయి. గోగర్భం తీర్థం సమీపంలోనిమఠాల నుంచి రింగ్‌రోడ్డు గ్యాస్‌ గోడౌన్‌ మీదుగా స్థానికులు నివాసం ఉండే  బాలాజీనగర్‌ తూర్పుప్రాంతం నుంచి దివ్యారామం వరకు సంచరిస్తున్నాయి.  టీటీడీ ఉద్యోగులు నివాసం ఉండే బీ, డీటైపు క్వార్టర్లు, మొదటి ఘాట్‌రోడ్డులోని  జింకలపార్కు నుంచి అవ్వాచ్చారి కోన, అలిపిరి కాలిబాటమార్గం మీదుగా దివ్యారామం, రెండో ఘాట్‌రోడ్డు ద్వారా శ్రీవారిమెట్టు వరకు కూడా కలియతిరుగుతున్నాయి.

చీకటిపడితే చిరుతల భయం..
పదిహేను రోజుల క్రితం ఇక్కడి బాలాజీనగర్‌ తూర్పుప్రాంతంలో ఓ ఇంట్లోకి చిరుత చొరబడి ఓ కుక్కను  ఎత్తుకెళ్లింది. ఇక ఆదివారం రాత్రి 7.30 గంటలకు అదే ప్రాంతానికే చిరుత మళ్లీ వచ్చింది. గంటపాటు కలియ తిరిగింది. ఆ దృశ్యాలను ఓ స్థానికుడు తన కెమెరాలో బంధించారు. పెద్ద ఎత్తున స్థానికులు  చేరుకోవడంతో ఆ చిరుత అడవిలోకి పారిపోయింది. గతంలోనూ గోగర్భం మఠాల్లోకి, వీఐపీల అతిథిగృహాల్లోకి చిరుత చొరబడిన ఘటనలు  కూడా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ మార్గంలో చిరుతలు వస్తాయోనని ఇటు భక్తులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ ఉద్యోగులు, కార్మికులతో పాటు దుకాణదారులు తమ నివాస ప్రాంతాలకు 24 గంటలు వెళ్లివస్తుంటారు. చిరుతల సంచారంతో  వారు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం?
ఐదేళ్ల్ల క్రితం అలిపిరి కాలిబాట మా ర్గంలో తరచూ సంచరించే రెండు చిరుతల్ని అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా  బోన్లు ఏర్పాటు చేసి బంధించారు.  దట్టమైన అటవీమార్గాల్లో వదిలిపెట్టా రు. అదే తరహాలో ప్రస్తుతం సంచరించే వాటిని కూడా బంధించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో భక్తులతో పాటు స్థానికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అనుకోని ఘటన జరిగితే దాని ఫలితం టీటీడీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా బాలాజీనగర్‌ సమీపంలో చిరుతల సంచారం బాగా పెరిగిపోయింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో శివారు ప్రాంతంలో కంచె నిర్మించాలని గతంలోనే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఆ ప్రతిపాదన ఇంతవరకు అమలు కాలేదు. ఆ దిశగా అయినా టీటీడీ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు