అడుగడుగునా దీన గాథలే..

19 Jan, 2018 02:19 IST|Sakshi

ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్న జనం

చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆగ్రహం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి  సాక్షి ప్రత్యేక ప్రతినిధి   : ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ.. అందరూ సర్కారు బాధితులే.. తమ బిడ్డకు మాటలు రావడం లేదని, మూగ, చెవుడుతో బాధ పడుతున్నా ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని కొందరు.. క్యాన్సర్‌తో బాధపడుతున్నా పట్టించుకోవడం లేదని మరికొందరు.. అన్ని అర్హతలున్నా పింఛన్లు రావడం లేదని ఇంకొందరు.. ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటి కోసం ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని ఎస్సీ, ఎస్టీలు.. రేషన్‌ కార్డులు తొలగిస్తున్నారని బలహీన వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించినందుకు చింతిస్తున్నామని, పేదల ఓట్లతో సీఎం అయ్యాక పేదల్నే రాచిరంపాన పెడుతున్నారని మండిపడ్డారు. ‘మా ఆశలన్నీ మీపైనే.. మీరొస్తేనే న్యాయం జరుగుతుంది.. మేమంతా మీ వెంటే’ అంటూ మద్దతు పలికారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర 65వ రోజు గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో సాగింది. అడుగడుగునా వివిధ వర్గాల ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటూ తమను ఆదుకోవాలని కోరారు. అందర్నీ పలకరిస్తూ, ఓదార్చుతూ వినమ్రంగా ముందుకు సాగిన జగన్‌.. సమస్యల తక్షణ పరిష్కారానికి తమ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదో కనుక్కోవాలని, కలెక్టర్‌కు లేఖలు రాయాలని చెప్పారు.  ‘ఈ ప్రభుత్వం పోతేనే జన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.. మన ప్రభుత్వం వచ్చాక అన్నీ చక్కబడతాయి’ అని హామీ ఇస్తూ జననేత ముందుకు సాగారు.  

దివ్యశ్రీది కదిలించే వేదన.. 
మూలకండ్రిగ గ్రామానికి చెందిన పదేళ్ల దివ్యశ్రీది గుండె కదిలించే దీనగాథ. చిన్నతనంలో సోకిన ఓ వ్యాధి కారణంగా ఆమె అచేతన స్థితికి చేరింది. లేచి నిలబడలేని స్థితి. తల్లిదండ్రులు తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రి మొదలు చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రుల చుట్టూ తిరిగారు. 4, 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడా చిన్నారికి వైద్యం అందించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారమైంది. ఈ వ్యాధి ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్నట్టయితే ఆ కుటుంబం చితికిపోయే పరిస్థితి వచ్చేది కాదు. అందుకే ఇటువంటి వ్యాధులన్నింటికీ అయ్యే ఖర్చును ప్రభుత్వమే బరాయించేలా చూస్తానని జగన్‌ భరోసా ఇచ్చారు.   

కనికరం లేని ప్రభుత్వం 
రాజులవారి కండ్రిగకు చెందిన చెంగల్రాయుడు కూర్చోలేడు, లేవ లేడు. తన బాధనూ చెప్పుకోలేని దయనీయ పరిస్థితి. మానసికంగా దివ్యాంగుడు. అటువంటి వ్యక్తికి కూడా కనీసం నెలనెలా ఇచ్చే బియ్యం ఇవ్వడం లేదని చెప్పి ఆయన తల్లి లక్ష్మమ్మ బావురుమంది. చలించిన జగన్‌.. ఈ ప్రభుత్వానికి కనికరం కూడా లేదనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇవ్వడం లేదో కనుక్కోవాలని తన సిబ్బందికి చెబుతూ కలెక్టర్‌కు తక్షణమే లేఖ రాయండని ఆదేశించారు. చేతి వేలి ముద్రలు పడడం లేదన్న సాకుతో ఈ దివ్యాంగుడిని అంత్యోదయ కార్డుదారుల జాబితా నుంచి ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇతని దీనస్థితి చూసిన వారందరూ ‘అయ్యో ఇతనికి బియ్యం ఇవ్వడం లేదా? ఇతన్ని చూస్తే జాలి కలగదా? ఇదేం రాజకీయం.. జన్మభూమి కమిటీల మాయకాకపోతే మరేమిటి?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   
 

మరిన్ని వార్తలు