మోసగించడం బాబు నైజం

27 Feb, 2018 04:17 IST|Sakshi

తిరుపతి మంగళం: చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్టీఆర్‌ గుర్తుకొస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఒక్కరికైనా అన్నం పెట్టారా? అని ప్రశ్నించారు. తిరుపతి పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండవ రోజు రాజకీయ శిక్షణ తరగతులకు సోమవారం తిరుపతి, నగరి, పుంగనూరు, పీలేరు నియోజక వర్గాల బూత్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు. తొలుత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి, దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రీజినల్‌ కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి, శాసనసభా  పక్ష నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాట్లాడుతూ పార్టీకి పునాదులు బూత్‌స్థాయి కమిటీ సభ్యులేనన్నారు. ప్రజలకు, పార్టీకి వారధిగా వైఎస్సార్‌సీపీ గెలుపులో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తలే రాజన్న రాజ్యానికి నిర్మాతలు..
డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలన్న చంద్రబాబు సీఎం అయ్యాక ప్రత్యేక ప్యాకేజీ బాటపట్టారని ధ్వజమెత్తారు. ప్యాకేజీ వస్తే రకరకాల పథకాల పేరుతో నిధులు పంచుకోవచ్చని భావించారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ నాడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో చంద్రబాబు కుమ్ముక్కై వైఎస్‌ జగన్‌ను జైల్లో పెట్టి, రకరకాల ఇబ్బందులకు గురిచేసినా కేవలం ప్రజల కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేం దుకు  వైఎస్‌  తరహాలో ప్రతిపక్ష నేత జగన్‌ ఏకంగా 3వేల కి.మీ పాదయాత్ర చేస్తున్నారని..ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని అన్నారు. ప్రభుత్వ అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారని చెప్పారు. నవరత్నాలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయని వివరించారు.

జగన్‌ ఒంటరి పోరాటం..
గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే, జగన్‌ ఒంటరి పోరాటం చేశారని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కుట్రలు పన్నడం మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే విపక్షాల ఓట్లను తొలగించి దొంగ ఓట్లను చేర్పించుకుంటున్నారని ఆరోపించారు. పేదవాడి సంక్షేమం కోసం జగన్‌ నవరత్నాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కొన్నివేల మంది ప్రాణాలను నిలబెట్టిందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మహానేత ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, రూ.2లకే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడ్డాయన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ పథకాలను తొలగించాల న్నా తొలగించలేని విధంగా జనంలోకి వెళ్లాయని వివరిం చారు. మాటమీద నిలబడేవ్యక్తి  జగన్‌ అని  తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కిలివేటి సంజీవయ్య తెలిపారు. బూత్‌ స్థాయిలో ఉన్న ఓటర్లపైన అవగాహన పెంచుకుని ఎన్నికలప్పుడు ఓట్లు వేసేందుకు వస్తున్న వారు నిజమైనవారా? కాదా? అని గుర్తించాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగనన్న వ్యక్తిత్వమే పార్టీకి పెట్టుబడి..
వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిన స్వల్ప వ్యవధిలో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోడానికి కారణం జగనన్న వ్యక్తిత్వమేనని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలతో పచ్చ ఛానళ్ల విష ప్రచారాలు చేసినా జగనన్న వ్యక్తిత్వాన్ని తగ్గించలేరని  అన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సొంత జిల్లాకు చిన్నపాటి పనిచేయలేని సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. సోషల్‌ మీడియాను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ఐటి విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్లా మధుసూధన్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లా ఎస్‌ కోట ఇన్‌చార్జ్‌ జోగినాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు