విజయా, దేనా బ్యాంక్‌ విలీనం?

23 Sep, 2017 03:44 IST|Sakshi

చర్చల్లో ఇరు బ్యాంకుల బోర్డులు

అనుమతులొస్తే మార్చికిపూర్తి కావొచ్చని అంచనా 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై కేంద్రం దృష్టి సారించిన నేపథ్యంలో తాజాగా మరో రెండు బ్యాంకులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. మధ్య స్థాయి పీఎస్‌యూ బ్యాంకులైన విజయా, దేనా బ్యాంక్‌ దీనిపై ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విలీనమైతే చేకూరే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు మొదలైన అంశాలపై రెండు బ్యాంకుల బోర్డులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే..ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికే విలీనం పూర్తి కావొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. విజయా బ్యాంకుకు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు ఉండగా, దేనా బ్యాంక్‌కు మహారాష్ట్ర, దాని పొరుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ఈ రెండూ కలిస్తే ఓబీసీ తరహాలో మధ్య స్థాయి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలవొచ్చని భావిస్తున్నారు. పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విజయా బ్యాంక్‌ లాభాలు 57% పెరిగి రూ. 255 కోట్లకు చేరగా, మొండిబకాయిలు 7.3%గా ఉన్నాయి.   క్యూ1లో దేనా బ్యాంక్‌ నష్టాలు రూ.133 కోట్లకు తగ్గగా, ఎన్‌పీఏలు 17.37 శాతానికి ఎగిశాయి. ప్రస్తుతం దేనా బ్యాంక్‌ లాభదాయకతను మెరుగుపర్చే పనిలో ఉంది. దేనా బ్యాంకుకు భారీ ఎన్‌పీఏలు ఉన్న నేపథ్యంలో.. విలీనమైతే ఏర్పడే బ్యాంకు మూలధన అవసరాలు మరింత అధికంగానే ఉండొచ్చు.

మరిన్ని వార్తలు