ఐపీఎల్‌లో తెలుగమ్మాయి

25 Apr, 2018 09:13 IST|Sakshi
హోస్ట్‌గావింధ్య విశాఖ

పోచారం: న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె యాంకర్‌గా మారారు. ఇప్పుడు ఐపీఎల్‌ హోస్ట్‌గా క్రికెట్‌ అభిమానులను ఆకర్షిస్తోంది వింధ్య విశాఖ. ఐపీఎల్‌ సీజన్‌–11లో తొలిసారిగా తెలుగు కామెంటరీకి శ్రీకారం చుట్టి తెలుగు భాషను గౌరవించింది స్టార్‌ సంస్థ. దాదాపు 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఐపీఎల్‌లో 30 మ్యాచ్‌లకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గత సంవత్సరం ప్రోకబడ్డీకి వ్యాఖ్యాతగా వ్యవహరించి స్టార్‌ స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టి తొలిసారి క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు. యాంకరింగ్‌తో సంతృప్తి చెందుతూ.. ఈ రంగంలోనే మరింత రాణించాలని ఆశిస్తున్నానని నారపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చెప్పారు.  

చదువులో చురుకుదనం..
వింధ్య ఘట్‌కేసర్‌కు చెందిన మేడపాటి వెంకటరెడి,్డ శేషారత్నం మనవరాలు మమతా సత్తిరెడ్డి కుమార్తె. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ చేశారు. చిన్నప్పటి నుంచి అటు చదువులోను, ఇటు ఆటల్లోను చురుకుగా ఉండే వింధ్య, హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అన్నా హజారే లోక్‌పాల్‌ బిల్లు కోసం చేసిన ఉద్యమానికి వలంటీర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈమె ప్రసంగాన్ని మెచ్చుకుని తొలిసారి హెచ్‌ఎంటీవీలో న్యూస్‌ రీడర్‌గా అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత మోడల్‌గానూ అడుగులు వేశారు. మా మ్యూజిక్‌ ఛానల్‌లో ‘ఛాయ్‌ బిస్కెట్‌’, టీవీ–9లో హాట్‌ వీల్స్, ఈటీవీ 2లో సఖీ, మా టీవీలో మా ఊరి వంట వంటి కార్యక్రమాలతో పాటు పలువురు సినీరంగ సెలబ్రిటీల ఇంటర్వ్యూలను అందించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వింద్య.  
 
పేదలకు చేయూతనివ్వాలని..  
తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిస్తే కెరీర్‌లో రాణించగలరని, ముఖ్యంగా తాను ఎంచుకున్న రంగంలో ప్యామిలీ సపోర్ట్‌ ఎంతో ఉందని విద్య తెలిపారు. యాంకరింగ్‌ చేస్తూనే స్వచ్ఛ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ స్థాపించి, పేదలకు చేయూతనిస్తూ సేవాభావం చాటుకుంటున్నారామె.

మరిన్ని వార్తలు