రెండు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం

29 Oct, 2017 01:43 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ధ్వంసమైన ఆటో కింద మృతదేహం

తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు

కొత్తపేట/బత్తలపల్లి: శ్రీవేంకటేశ్వరుని దర్శనానికెళ్తున్న వారిని ఆయన సన్నిధికి చేరకుండానే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. తెల్లవారుజామున ఆటోలో వెళ్తుండగా రాంగ్‌రూట్‌లో వచ్చిన టిప్పర్‌ ఢీకొనడంతో ఆటోలోని ఆరుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఘటనలో ప్రయాణికుల్ని చేరవేసే క్రూజర్‌ వాహనం టైరు పంక్చరై నలుగురు మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో 10 మంది చనిపోగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం శివారం మంచినీటి చెరువుగట్టుకు చెందిన ఓ చిన్నారి సహా 13 మంది మహిళలు.. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి బయల్దేరారు. ఆటోలో వెళ్తుండగా చిట్టూరివారిపాలెం వద్ద ఎదురుగా బ్లాక్‌మెటల్‌ చిప్స్‌ లోడుతో రాంగ్‌రూట్‌లో వచ్చిన టిప్పర్‌ ఆటోను ఢీకొంది. ఆటో నుజ్జవ్వగా, అందులో ప్రయాణిస్తున్న చీకట్ల నాగమణి (46), పేరాబత్తుల అనంతలక్ష్మి (36), పిల్లా గంగాభవాని (28), పులిమే అనంతలక్ష్మి (45), పిల్లా పార్వతి (48), పిల్లా దుర్గ (45) మృతి చెందారు. 

వాహనం అదుపు తప్పి..
కదిరి నుంచి అనంతపురానికి ప్రయాణికులను చేరవేస్తున్న క్రూజర్‌.. నల్లబోయనపల్లి గుట్ట వద్దకు చేరుకోగానే వెనుక టైర్‌ పంక్చరైంది. అదుపుతప్పిన వాహనం 50 అడుగుల దూరం పల్టీలు కొట్టి గోతిలో పడిపోయింది.  శంకర్‌ (46),  రమణారెడ్డి (47),  బాబాజీ (22) అనే ముగ్గురితోపాటు మరో గుర్తు తెలియని వ్యక్తి(47) మృతి చెందారు.   డ్రైవర్‌ సూర్యనారాయణరెడ్డి పరారయ్యాడు. మృతుడు బాబాజీకి ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది.

మృతులకు వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా చిట్టూరివారిపాలెం రోడ్డు ప్రమాద మృతులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేశారు.

మరిన్ని వార్తలు