కొకైన్‌ అక్రమ రవాణా కేసులో యువతికి పదేళ్ల జైలు  

1 Jun, 2019 02:48 IST|Sakshi

సైబరాబాద్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు

హైదరాబాద్‌: కొకైన్‌ మాదక ద్రవ్యాన్ని అక్రమ రవాణా చేసిన కేసులో ఢిల్లీకి చెందిన జ్యోతిఝూ అనే యువతికి సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.లక్ష జరిమానాను విధిస్తూ సెషన్స్‌కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. మూడేళ్ల క్రితం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ యువతి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తోందన్న సమాచారం అందుకున్న డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారి రంగనాథన్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెట్టారు. హైదరాబాద్‌కు చేరుకోగానే జ్యోతిఝాను అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా ఐదు పుస్తకాల్లో రూ.పదికోట్ల విలువ చేసే కొకైన్‌ బయటపడింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఓ నైజీరియన్‌ మిత్రుడికి ఈ పుస్తకాలను అందజేయాలనుకున్నట్లు నాటి విచారణలో తెలిపింది. యువతిని అదుపులోని తీసుకుని రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగ పత్రం నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

బావమరిది హత్య కేసులో...
బావమరిదిని హత్య చేసిన ఓ వ్యక్తికి జీవిత ఖైదుతోపాటు రూ.వేయి జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా అండ్‌ సెషన్స్‌ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. నాగోలు బ్లైండ్‌ కాలనీలో నివాసముండే బాబామీయా సలీమాబేగం దంపతులకు ముగ్గురు సంతానం. మద్యానికి అలవాటుపడి ప్రతిరోజూ భార్య సలీమాబేగంను హింసించేవాడు. ఆ క్రమంలో 2014 సెప్టెంబర్‌ 9న వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సలీమా బేగం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె సోదరుడు మహ్మద్‌ ఖలీం ఆ మరుసటిరోజే బాబామీయాపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. ఈ కేసు విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం ఎనిమిదవ అదనపు డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెలువరించారు. 

మరిన్ని వార్తలు