అల్‌ఖైదా ఉగ్రదాడి..11 మంది సైనికుల మృతి

29 Mar, 2018 11:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యెమెన్‌ :  ఆర్మీ కాన్వాయ్‌పై అల్‌ ఖైదా తీవ్రవాదులు మెరుపుదాడి చేయడంతో 11 మంది యెమెన్‌ సైనికులు మృతిచెందారు.  ఈ సంఘటన ఆగ్నేయ హంద్రామౌట్‌ ప్రావిన్స్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుందని భద్రతాబలగాల అధికారి తెలిపారు. చనిపోయిన సైనికుల్లో అందరూ కొత్తగా రిక్రూట్‌ అయిన వారే ఉన్నారని చెప్పారు.

కొత్తగా నియామకమైన భద్రతా బలగాలకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో పాటు,  ప్రత్యేక భద్రతా బలగాలు కూడా యెమెన్‌లో సహకారం అందిస్తున్నాయి. వివిధ దిశల నుంచి ఒకేసారి కాల్పులు జరపడం వల్ల మృతుల సంఖ్య పెరిగిందని, అందువల్లే కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయామని ఓ అధికారి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా అల్‌ ఖైదా ఇన్‌ అరేబియన్‌ పెనిన్సులా(ఏక్యూఏపీ),  ఐసిస్‌తో పాటు పలు ఉగ్రవాద సంస్థలు ఆగ్నేయ ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

ముఖ్యంగా అల్‌ ఖైదా, ఐసిస్‌కు చెందిన వారు ఆత్మాహుతి దాడులకు కూడా దిగుతున్నారు. మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న మొదటి దేశంగా ఐక్యరాజ్యసమితి యెమెన్‌ దేశాన్ని ప్రకటించింది. కరువు, కలరా కారణంగా సుమారు 70 లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు, మరో 2,000 మంది మృతిచెందారు. 

మరిన్ని వార్తలు