24 రోజులు...12 హత్యలు!

25 Jun, 2020 12:20 IST|Sakshi

నగరంలో జరిగిన ఉదంతాలే అత్యధికం

ఇక్కడే తొమ్మది హత్య కేసులు నమోదు

సైబరాబాద్, రాచకొండల్లో మరో మూడు

పోలీసింగ్‌ పట్టుతప్పడంపై పలు విమర్శలు

సాక్షి, సిటీబ్యూరో: నేరాల్లో హత్య కేసుకు పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇవి జరగకుండా నిరోధించడంతో పాటు జరిగిన వెంటనే స్పందిస్తూ నిందితుల్ని అరెస్టు చేస్తుంటారు. నడిరోడ్లపై జరిగే ఇలాంటి దారుణాలు శాంతిభద్రతల నిర్వహణ పైనా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో గడిచిన 24 రోజులు (మే 31–జూన్‌ 23) మధ్య మొత్తం 12 హత్యలు జరగడం... అందులో తొమ్మిది నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోనే చోటు చేసుకోవడం నగరవాసి ఉలిక్కిపడేలా చేసింది. కొవిడ్‌ హడావుడి నేపథ్యంలో సాధారణ పోలీసింగ్‌ పట్టుతప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఈ హత్యలకు కారణాలు అనేకం...
రాజధానిలో చోటు చేసుకున్న ఈ 12 హత్యల్లో మూడు రౌడీషీటర్లకు సంబంధించినవి. ఆధిపత్యపోరు, వ్యక్తిగత కక్షలు, ఇతర వివాదాల్లో వీరు హతమయ్యారు. పోలీసు విభాగం ఓపక్క కౌన్సిలింగ్స్, బైండోవర్లు చేస్తున్నా.. రౌడీషీటర్ల వంటి అసాంఘికశక్తులు తమ కార్యకలాపాలు కొనసాగించడం, ఆ వివాదాల నేపథ్యంలో హత్యకు గురికావడం విమర్శలకు తావిస్తోంది. మరోపక్క మద్యం మత్తులో జరిగిన హత్యలు కూడా ఉన్నాయి. కుటుంబ కలహాలు, మద్యం తాగవద్దన్న కారణంతో భార్యల్ని హత్య చేసిన భర్తల కేసులు నగరంలో నమోదయ్యాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి వివాదాలు సైతం హత్యల వరకు వెళ్ళిన ఉతందాలు నమోదయ్యాయి. 

నడిరోడ్డుపై నరికేస్తున్నా...
ఇటీవల కాలంలో జరిగిన 12 హత్యల్లో కొన్ని నడిరోడ్డపై జరిగినవి ఉన్నాయి. వీటిలో రౌడీషీటర్‌తో పాటు యువకుడు హతమయ్యాయి. పట్టపగలు, నడిరోడ్డుపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నా చుట్టు పక్కల ఉన్న వారు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ కళ్ళ ఎదుటే ఓ వ్యక్తి ప్రాణం పాశవికంగా తీస్తుంటే అంతా కలిసి అడ్డుకోవడం మరిచి చోద్యం చూస్తున్నారు. హత్య జరిగిన తర్వాత కూడా హంతకుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఉదంతం ఒక్కటి కూడా లేదు. ఆయా దారుణాలు జరిగిపోయిన తర్వాత 100 లేదా 108లకు ఫోన్లు చేయడం మాత్రం జరుగుతోంది. గతంలోనూ రాజధానిలో నడిరోడ్డుపై హత్యలు జరగడం, వాటిని ఎవరూ అడ్డుకోకపోవడంపై పెద్ద దుమారం రేగింది. అయినప్పటికీ సగటు నరవాసిలో మార్పు ఏమాత్రం కనిపించట్లేదు.    

ఇటీవలి దారుణాలివీ..
బంజారాహిల్స్‌ ఇందిరానగర్‌లో భార్య అనితను భర్త అనిల్‌ దారుణంగా చంపిన ఉదంతం గత నెల 31న చోటు చేసుకుంది. వీరిద్దరిదీ ప్రేమవివాహం కావడం గమనార్హం.  
అదే రోజు పాతబస్తీలోని బహదూర్‌పుర ఠాణా పరిధిలోని మీరాలం ప్రాంతంలో అలీబాగ్‌కు చెందిన షేక్‌ మహ్మద్‌ హత్యకు గురయ్యాడు.
ఈ నెల 1న ఎస్సార్‌ నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో మద్యానికి బానిసైన భర్త సంజీవ్‌... తాగ వద్దన్నందుకు తన భార్య రాణిని హత్య చేశాడు.
గాంధీనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో బన్సీలాల్‌పేటకు చెందిన కృష్ణ ఈ నెల 3న హత్యకు గురయ్యాడు.
మల్లేపల్లికి చెందిన రాహుల్‌ చంద్‌ అగర్వాల్‌ ఈ నెల 5న గోల్కొండ ఠాణా పరిధిలోని బంజరు దర్వాజ–అల్జాపూర్‌ రోడ్డులోని శ్మశానవాటిక వద్ద హత్యకు గురయ్యాడు.
అదే రోజు రెయిన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మహ్మద్‌ ఇమ్రాన్‌ను అతడి సవతి సోదరులే చంపేశారు.
ఈ నెల 5నే లంగర్‌హౌస్‌ పరిధిలో రౌడీషీటర్లు చందీ మహ్మద్‌ , అబూలను నానల్‌నగర్‌ చౌరస్తా వద్ద దారుణంగా చంపేశారు.  
ఈ నెల 19న బేగంబజార్‌ పరిధిలోని పటేల్‌బస్తీకి చెందిన రుబీనాబేగంను ఆమె భర్త సాబేర్‌ హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే దీనికి కారణం.
సోమవారం శాలిబండ పోలీసుస్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌ మహ్మద్‌ ఖాలేద్‌ తాగి గొడవ చేస్తున్నాడని సొంత మేనల్లుడు షేక్‌ అబ్దుల్‌ సులేమాన్‌ హత్య చేశాడు.
వీటితో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్‌ పరిధిలోని రాజేంద్రనగర్, సనత్‌నగర్, బాలాపూర్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ కాలంలో మూడు హత్యలు చోటు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు