పొలం కాజేసిన 12 మంది అరెస్ట్‌

2 Dec, 2019 04:57 IST|Sakshi
మాట్లాడుతున్న ఎస్పీ విజయారావు, వెనుక వరుసలో నిందితులు

నిందితుల్లో పోలీస్‌ కానిస్టేబుల్‌ 

గుంటూరు జిల్లాలో ఘటన 

గుంటూరు: అమాయకుడైన ఓ వ్యక్తిని టార్గెట్‌ చేసి ఆయనకు చెందిన రూ.15 కోట్ల విలువైన 6.33 ఎకరాల పొలాన్ని కాజేసిన 12 మందిని గుంటూరు జిల్లా అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒక కానిస్టేబుల్‌ కూడా ఉండటం గమనార్హం. గుంటూరు జిల్లా రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతి మండలం ధరణికోటకు చెందిన వడ్లమూడి రమేశ్‌ బాబుకు 6.33 ఎకరాల పొలం ఉంది. రమేశ్‌ పొలంపై అదే గ్రామానికి చెందిన చేకూరి వెంకటేశ్వరరావు కన్నేశాడు. ముందుగా పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తన స్నేహితుడైన కానిస్టేబుల్‌ పెద్ద బాబీకి తన ప్రణాళికను వివరించాడు. అతడి సహకారంతో అమరావతి శివారులో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు.

ఈ ఏడాది అక్టోబర్‌ 19న పొలం కౌలుకు కావాలని.. మాట్లాడేందుకు ఆ గది వద్దకు రమ్మని రమేశ్‌ను వెంకటేశ్వరరావు పిలిపించాడు. అక్కడకు వచ్చిన రమేశ్‌ను షేక్‌ రషీద్, జ్ఞానేశ్వరరావు, రవీంద్రరెడ్డి సాయంతో బంధించారు. మరుసటి రోజు రమేశ్‌ మేనమామ హనుమంతరావు వదకెళ్లి మీ అల్లుడికి యాక్సిడెంట్‌ అయిందని నమ్మించి ఆయనను కూడా గదికి తీసుకెళ్లి కట్టేశారు. తర్వాత వారిద్దరి కళ్లకు గంతలు కట్టి.. సినీఫక్కీలో కరెంట్‌ షాక్‌ ఇవ్వడం, విషం ఇంజక్షన్‌ చేస్తున్నామని భయపెట్టి నీళ్ల ఇంజక్షన్‌ను ఎక్కించడం చేసి పొలాన్ని నిందితుల పేర్లతో రిజిస్టర్‌ చేసేందుకు ఒప్పించారు.

అనంతరం అమరావతిలోని గోపాల్‌నగర్‌కు చెందిన బొంత శివకృష్ణ, బసవ శంకర్, గుడిసే వినోద్‌ కుమార్‌ సహకారంతో వెంకటేశ్వరరావు మామ బచ్చల నారయ్య, అతని భార్య నాగ స్వరూప, ఆమె మేనమామ పత్తిపాటి వెంకటేశ్వర్లు పేర్లతో పొలాన్ని రిజిస్టర్‌ చేయించి రమేశ్‌ను, అతడి మేనమామను వదిలేశారు. నెల తర్వాత బాధితుడు ఫిర్యాదు చేయడంతో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు