12 ఏళ్ల పాపపై రెండేళ్లుగా 30 మంది....

26 Sep, 2019 18:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అమ్మా! నన్ను క్షమించు’ ఓ 12 ఏళ్ల బాలిక తన ఇంటి తలుపుపై రాసిన సందేశం. ఈ మూడు పదాల వెనక అంతులేని విషాధం దాగుంది. ఆమెది కేరళ. అక్కడ తన తల్లి, తండ్రి, నానమ్మతో కలిసి ఓ పాత అపార్ట్‌మెంట్‌లోని ఓ చిన్న పోర్షన్‌లో ఉంటోంది. సమీపంలోని ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటోంది. గత రెండేళ్లుగా ఆమె తన ఇంట్లోనే నరకం అనుభవిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఆమెను కనీసం 30 మంది వరుసగా రేప్‌ చేస్తూ వచ్చారు. అందుకు ఆస్కారం ఇచ్చింది ముందుగా ఆమె తండ్రే. 

ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు కనీసం తిండి పెట్టలేక పోతున్న ఆ తండ్రి ఓ స్నేహితుడి వద్ద డబ్బులు తీసుకొని, అతన్ని ఓ రోజు తన కూతురు వద్దకు పంపించారు. ఆ రోజున ఆ ఆగంతకుడి అఘాయిత్యం నుంచి తప్పించుకునేందుకు ఆ పాప ఏడ్చి పెడ బొబ్బలు పెట్టినా ఇరుగు పొరుగు వారు కూడా పట్టించుకోలేదు. కొంతకాలం వరకు ఆమె ఆక్రందనలు అలాగే కొనసాగాయి. ఆ పాప తల్లికి పరిస్థితి అర్థమయ్యే ఉంటోంది. ఆమె కూతురు గదిలోకి రావడంగానీ, పలకరించడంగానీ చేయకుండా కూతురుకు దూరదూరంగా ఉంటూ వచ్చింది. మొదట్లో ఆరు నెలల పాటు ఈ అఘాత్యాలను పట్టి బిగువున భరిస్తూ స్కూలుకు వెళ్లిన ఆ అమ్మాయి, ‘ఎందుకు ఎలాగో ఉంటున్నావంటూ’ తోటి వారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేక ఆ తర్వాత స్కూలుకు వెళ్లడమే మానేసింది. 

ఇంటి నుంచి చాలాసార్లు పారిపోదామనుకుని ప్రయత్నించి, అమాయకంగా బిక్క మొహం వేసుకునే అమ్మ, మందులు లేకుండా ఒక్క రాత్రి కూడా నిద్రపోలేని నానమ్మ, ఉద్యోగం దొరక్క దేశ దిమ్మరిగా తిరుగుతున్న తండ్రి గుర్తొచ్చి, మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేది. స్కూల్‌ మానేశాక ఆ పాపపై లైంగిక దాడులు మరీ పెరిగాయి. మొదట అత్యాచారం చేసిన తండ్రి స్నేహితుడే బ్రోకర్‌గా మారారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆ పాపను ఏడాది కాలంగా అనుమతించడం లేదు. ఈ మధ్య ఆ పాప అరుపులు ఎక్కువవడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలాకాలంగా ఆ పాప అరుపులు వినిపిస్తున్నాయని, గతంలో హుషారుగా కనిపించే ఆ పాప బాగా నీరసించి ముభావంగా మారిపోయిందని, మనకెందుకొచ్చిన గొడవంటూ ఇన్నాళ్లు వదిలేశామని, మరీ భరించలేని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పక్క ఫ్లాట్‌లో ఉంటున్న ఓ ఉద్యోగి తెలిపారు. 

గత ఆదివారం (సెప్టెంబర్‌ 22న) రాత్రి పోలీసులు ఆ పాప ఇంటిపై దాడిచేసి తండ్రితోపాటు ఒకరిద్దరు విటులను అరెస్ట్‌ చేశారు. ఆ పాపను అదుపులోకి తీసుకొని విచారించగా, రెండేళ్ల నుంచి తనపై సాగుతున్న అత్యాచార పర్వం గురించి ఆమె నిర్భయంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం ఆ పాపను ప్రభుత్వ ఆడపిల్లల సంరక్షణ కేంద్రానికి పోలీసులు తరలించారు. పోలీసులు ఆ పాపను ఇంటి నుంచి తీసుకెళుతున్నప్పుడు ఆ పాప తన ఇంటి తలుపుపై ‘అమ్మా! సారీ’ అని రాసింది. ‘మీకు పట్టెడన్నం పెట్టడం కోసం ఈ పాడు వృత్తిని కొనసాగించలేక పోతున్నానన్న బాధనా లేదా ఈ రకంగా నీకు దూరం అవుతున్నానన్న ఆవేదననా ఆ సారీకి అర్థం!?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా